Asianet News TeluguAsianet News Telugu

జగన్ టీంలోకి ఫైర్ బ్రాండ్ కలెక్టర్ : త్వరలో ఏపీకి తెలుగు ఐఏఎస్ రోహిణి సింధూరి

12ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహామస్తాభిషేకం కార్యక్రమం నిర్వహణకు ప్రభుత్వం రూ.250 కోట్లు కేటాయించింది. పనుల్లో భాగంగా టెండర్లు పారదర్శకంగా నిర్వహించాలని రోహిణీ భావించారు. అయితే ఒక టెండర్ విషయంలో మంత్రి మంజుకు కలెక్టర్ కు బేదాభిప్రాయాలు చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ ఆమె ఎలాంటి ఒత్తిడిలకు భయపడలేదు.
 

karnataka state haasan collector rohini sindhuri likely joined ap government
Author
Amaravathi, First Published Jul 20, 2019, 9:05 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పాలనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో దూసుకుపోతున్న సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అవినీతి రహిత పాలన అందించాలనే లక్ష్యంతో స్పందన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 

వైయస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం స్పందన. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను ఫిర్యాదు చేసుకునేలా అవకాశం కల్పించారు జగన్. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులకు వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని జగన్ అభిప్రాయం. 

ఇప్పటికే అధికారులందరికీ ఆదేశాలు సైతం జారీ చేశారు. ఇటీవలే అలసత్వం వహించిన ఓ అధికారిపై సైతం వేటు వేయించారు సీఎం జగన్. ఇలాంటి కార్యక్రమాన్ని పక్కా పకడ్బందీగా చేయాలని తీర్మానించుకున్నారు. 

అందులో భాగంగా ఫైర్ బ్రాండ్ ఐఏఎస్ ను తన టీంలోకి తెచ్చుకోవాలని సీఎం వైయస్ జగన్ నిర్ణయించుకున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న కర్ణాటక కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి, తెలుగు అమ్మాయి అయిన దాసరి రోహిణి సింధూరికి ఈ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వానికి సీఎం జగన్ లేఖ రాసినట్లు తెలుస్తోంది. రోహిణీ సింధూరి ఏపీకి పంపే అంశంపై కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా సమాచారం. రెండు మూడు రోజుల్లో ఆమె డిప్యుటేషన్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతున్నారని ప్రచారం జరుగుతోంది.  

కర్ణాటక కేడర్ కు చెందిన దాసరి రోహిణీ సింధూరి ప్రస్తుతం హాసన్ జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో రోహిణీ సింధూరికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎలాంటి రాజకీయాలకు తలొగ్గకుండా నీతివంతంగా పనిచేస్తారని మంచి పేరుంది. 

హాసన్ జిల్లాకు చెందిన మంత్రి మంజుకు చుక్కలు చూపించి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందారు దాసరి రోహిణి సింధూరి. జైనులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే కార్యక్రమం శ్రావణ బెళగళలోని గోమఠేశ్వరుడి మహామస్తాభిషేకం కార్యక్రమాన్ని ఆరు నెలల వ్యవధిలో నిర్వహించించి రికార్డు సృష్టించారు.

12ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహామస్తాభిషేకం కార్యక్రమం నిర్వహణకు ప్రభుత్వం రూ.250 కోట్లు కేటాయించింది. పనుల్లో భాగంగా టెండర్లు పారదర్శకంగా నిర్వహించాలని రోహిణీ భావించారు. అయితే ఒక టెండర్ విషయంలో మంత్రి మంజుకు కలెక్టర్ కు బేదాభిప్రాయాలు చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ ఆమె ఎలాంటి ఒత్తిడిలకు భయపడలేదు.

అధికారంలో ఉన్న ఆ మంత్రికి చుక్కలు చూపించారు. చట్టానికి చుట్టాలుండరని నమ్మటమే కాదు ఆచరణలో చూపించి అందరి ప్రశంసలు పొందారు. ఆ తర్వాత అదే మంత్రి సార్వత్రిక ఎన్నికల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించడంతో ఆయనపై కేసులు సైతం నమోదు చేశారు కలెక్టర్ రోహిణి. 

అలాంటి సమయంలో ఆమెను బదిలీ చేయించారు. బదిలీపై ప్రభుత్వంపై పోరాడి కేసులో గెలిచారు రోహిణి. మళ్లీ హసన్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంజు ఓటమి పాలయ్యారు. 

ఇకపోతే రోహిణీ సింధూరి స్వస్థలం ఖమ్మం జిల్లా రుద్రాక్షపల్లి. ఆమె తండ్రి హైకోర్టులో ఉద్యోగం రీత్యా ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉన్నారు. ఇంజనీరింగ్ చదివిన ఆమె ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకుని యూపీఎస్సీ పరీక్షలు రాశారు. ఆమె 43వ ర్యాంకు సాధించి ఐఏఎస్ కు ఎంపికయ్యారు. 2009 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆమె కర్ణాటక కేడర్ ఎంపికయ్యారు. 

ఇకపోతే రోహిణి సింధూరి అమ్మమ్మ స్వగ్రామం నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లాకు చెందిన సుధీర్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. సుధీర్ రెడ్డి వృత్తిరీత్యా సాఫ్ట్ వేర్. అయితే నెల్లూరు జిల్లాలో పేపర్ ఇండస్ట్రీ నడుపుతున్నారు. 

మరోవైపు మాండ్య జిల్లాలో ఏడాదిలోనే లక్ష టాయిలెట్లు నిర్మించి రోహిణి రికార్డు సృష్టించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా మరుగుదొడ్లు నిర్మించిన మూడు జిల్లాలలో ఒక జిల్లాగా మాండ్యను నిలిపారు. 

రైతులకు కరువు సాయం అందిచడంతోపాటు, కల్పామృత ప్రాజెక్టు ద్వారా కొబ్బరి నీళ్లను ఎలా మార్కెటింగ్ చేయొచ్చు అనే అంశంపై క్రియాశీలకంగా వ్యవహరించారు రోహిణి. ఫైర్ బ్రాండ్ ఐఏఎస్ అధికారిగా పేర్గాంచిన రోహిణి సింధూరి ఏపీకి వస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతోంది. ఆమెకు స్వాగతం పలుకుతూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. మరి ఆమె వస్తున్నారా లేక ఇదంతా ప్రచారరమా అనేది తెలియాల్సి ఉంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios