కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా కలకలం రేగుతోంది. కరోనా లక్షణాలతో కర్ణాటక రాష్ట్రంలోకి అడుగుపెట్టిన ఓ వ్యక్తి... కనీసం పరీక్షలు చేయించుకోకుండా తప్పించుకున్నాడు. కాగా... ప్రస్తుతం ఆ వ్యక్తి కోసం రాష్ట్రం మొత్తం గాలిస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఆదివారం సాయంత్రం దుబాయి నుంచి ఓ వ్యక్తి కర్ణాటకలోని మంగళూరుకు చేరుకున్నాడు. ఎయిర్ పోర్టులో ఆయనకు కరోనా లక్షణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో నిజంగా కరోనా సోకిందా లేదా అనే విషయం తెలుసుకునేందుకు ఓ హాస్పటల్ కి వెళ్లి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా అధికారులు సూచించారు. 

మంగళూరులోని జిల్లా ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు  చేయించుకోవాల్సిందిగా అధికారులు సూచించారు. అక్కడే 14రోజులపాటు ఉంచి.. పరీక్షలు చేయించాలని అధికారులు చెప్పారు. వారు చెప్పినదానికి అతను తొలుత అంగీకారం తెలిపాడు. అయితే అనూహ్యంగా అక్కడి నుంచి ఆస్పత్రికి వెళ్లకుండానే తప్పించుకున్నాడు.

అతను ఆస్పత్రికి వెళ్లకుండా తప్పించుకోవడాన్ని గుర్తించిన పోలీసులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు అతని కోసం గాలించడం మొదలుపెట్టారు. ముందుగానే పోలీసులు, కొందరు అధికారులు అతని ఇంటికి చేరుకున్నారు. అక్కడ అతనికోసం ఎదురు చూస్తున్నారు.

Also Read కరోనా వైరస్ సోకిన 100ఏళ్ల వృద్ధుడు... పూర్తిగా కోలుకొని...

అతనిని ఎలాగైనా పట్టుకొని ఆస్పత్రిలో చేర్పిస్తామని  సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఇదిలా ఉండగా... ఇప్పటి వరకు మొత్తం భారత్ లో 43మంది కి కరోనా సోకినట్లు గుర్తించారు. కాగా... చైనాలోని వుహాన్ లో మొదలైన ఈ వైరస్ ఇప్పటి వరకు 100 దేశాలకు పాకింది. ఇప్పటి వరకు 3వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

తాజాగా కేరళలో ఓ మూడేళ్ల చిన్నారి, జమ్మూకశ్మీర్ లో 63ఏళ్ల ఓ మహిళకు కూడా కరోనా సోకినట్లు గుర్తించారు. కేరళకు చెందిన మూడేళ్ల చిన్నారి ఇటీవల తన తల్లిదండ్రులతో కలిసి ఇటలీ వెళ్లింది. శనివారం కేరళ చేరుకోగా.. కరోనా సోకినట్లు గుర్తించారు. ఇక జమ్మూకశ్మీర్ కి చెందిన మహిళ ఇరాన్ వెళ్లి వచ్చినట్లు గుర్తించారు. కాగా ఈ కరోనా వైరస్ జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలతో మొదలౌతుందన్న సంగతి తెలిసిందే.