కరోనా వైరస్... ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇప్పటికే ఈ వైరస్ సోకి చైనాలో దాదాపు 3వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 80వేల మంది ఈ వైరస్ సోకి బాధపడుతున్నారు. కేవలం చైనాలోనే మాత్రమే కాకుండా ఇతర దేశాల్లోనూ ఈ వైరస్ పాకింది. పలు దేశాల్లో చాలా మంది ఈ వైరస్ కారణంగా చనిపోయారు.

Also Read తొలి కేసు: మనిషి నుంచి కుక్కకు పాకిన కరోనా వైరస్...

దీంతో... చాలా మంది ప్రజలు ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టాలంటే భయపడిపోతున్నారు. మూతికి మాస్కులు ధరించి, వెంట సానిటైజర్లు పెట్టుకొని తిరుగుతున్నారు. ఒక్కసారి కరోనా సోకిందంటే ఇక వాళ్లు బ్రతకడం కష్టమనే భావన అందరిలోనూ కలిగింది. ఈ వైరస్ కి ఇప్పటి వరకు మందు కనిపెట్టలేకపోయారని ప్రజలు భావిస్తున్నారు. అయితే... ఇలాంటి వారి కోసం చైనా దేశం ఓ వార్త తెలియజేసింది.

కరోనా వైరస్ సోకిన ఓ 100ఏళ్ల వృద్ధుడు..క్షేమంగా దాని నుంచి బయటపడ్డాడు. ఆయన ఆ వైరస్ సోకిన తర్వాత అందించిన చికిత్సకు రెస్పాండ్ అయ్యాడు. దీంతో ఆ వైరస్ తగ్గిపోయి.. తిరిగి ఆరోగ్యవంతుడయ్యాడు. దీంతో  సదరు వృద్ధుడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కూడా చేశారట. ఈ విషయాన్ని అధికారులు స్వయంగా వెల్లడించారు.

గత నెల ఫిబ్రవరి 24వ తేదీన కరోనా వైరస్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ఆ వృద్ధుడికి.. వైద్యులు 13 రోజుల పాటు చికిత్స అందించారు. ఆ చికిత్స తర్వాత ఆయన పూర్తిగా కోలుకోవడంతో తాజాగా డిశ్చార్జ్ చేశారు. దీంతో.. వైరస్ సోకినప్పటికీ తగిన చికిత్స అందిస్తే కోలుకునే అవకాశం ఉంటుందని వైద్యులు చైనాలో ని ప్రజలకు ధైర్యం నింపుతున్నారు. అందుకు  ఈ వృద్ధుడిని ఉదాహరణగా చూపిస్తున్నారు.