Bengaluru: కర్ణాటక ఎన్నికలకు ముందు 8 వేల కిలోమీటర్లు బీజేపీ యాత్ర చేప‌ట్ట‌నుంది. ఈ 'విజ‌య్ సంక‌ల్ప్ యాత్ర‌' 8,000 కిలోమీటర్లు ఉంటుంద‌నీ, ఇందులో 80 ర్యాలీలు, 74 బహిరంగ సభలు, సుమారు 150 రోడ్ షోలను ప్లాన్ చేసిందనీ, ఇది దాదాపు నాలుగు కోట్ల మంది వ‌ద్ద‌కు చేరుకుంటుందని బీజేపీ పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. 

Karnataka BJP Vijay Sankalp Yatra: త్వ‌ర‌లోనే క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో రాష్ట్రంలోని ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు ఇప్పటినుంచే ముమ్మ‌రంగా ప్ర‌చారం సాగిస్తున్నాయి. మ‌రోసారి అధికారం ద‌క్కించుకోవాల‌ని బీజేపీ వ్యూహాలు ర‌చిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఎన్నిక‌ల‌కు ముందు రాష్ట్రంలో భారీ యాత్ర‌ను చేప‌ట్టనుంది. బుధవారం (మార్చి 1) రాష్ట్రవ్యాప్తంగా నాలుగు వేర్వేరు దిశల నుంచి ప్రత్యేకంగా రూపొందించిన వాహనాలు, రథాల్లో పార్టీ కేంద్ర నాయకులతో 'విజయ్ సంకల్ప యాత్ర'ను ప్రారంభించనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చామరాజనగర్ జిల్లాలోని మలే మహదేశ్వర హిల్స్ నుంచి యాత్రను ప్రారంభించనున్నార‌ని బీజేపీ వ‌ర్గాలు తెలిపాయి.

Scroll to load tweet…

రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మార్చి 2న బెళగావి జిల్లా నందగడ్ నుంచి మరో యాత్రను జెండా ఊపి ప్రారంభించనుండగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీదర్ జిల్లాలోని బసవకల్యాణ, బెంగళూరు సమీపంలోని దేవనహళ్లిలోని అవంతి నుంచి మార్చి 3న ఉదయం, మధ్యాహ్నం వ‌రుస‌గా మూడు, నాలుగో యాత్రలను ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు బీఎస్ యడ్యూరప్ప, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్, జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి ఈ యాత్రల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.

'ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా ఇప్పటికే రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఎన్నికల ఇంచార్జీలుగా ఉన్న కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, మన్సుఖ్ మాండవీయ కూడా వచ్చారు. ఇంకా చాలా మంది ముఖ్య నేతలు కూడా ప్రచారానికి రాష్ట్రంలో పర్యటిస్తారని తెలిపారు. మార్చి 1,2,3 తేదీల్లో ప్రారంభమయ్యే రథయాత్రలు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తాయనీ, ఈ యాత్రలో కూడా పలువురు పార్టీ నేతలు రాష్ట్రంలో పర్యటిస్తారని పార్టీ నేత‌లు తెలిపారు. మేలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలోని 31 జిల్లాలు, 224 నియోజకవర్గాల్లో జరిగే ఈ ప్రచారంలో 50 మందికి పైగా రాష్ట్ర, జాతీయ నాయకులు పాల్గొంటారని పార్టీ నేతలు వెల్ల‌డించారు. ఈ పర్యటనలు 8,000 కిలోమీటర్లు ఉంటాయనీ, ఇందులో పార్టీ 80 ర్యాలీలు, 74 బహిరంగ సభలు, సుమారు 150 రోడ్ షోలను ప్లాన్ చేసిందని, ఇది సుమారు నాలుగు కోట్ల మందిని చేరుకుంటుంద‌ని చెప్పారు. 

మార్చి 25న జిల్లా కేంద్రమైన దావణగెరెలో జరిగే భారీ ర్యాలీతో 20 రోజుల విజ‌య్ సంక‌ల్ప్ యాత్ర ముగుస్తుంద‌ని తెలిపారు. నాలుగు వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రలో ఒక్కొక్క యాత్ర‌లో 10-12 మంది నాయకులు ఉంటారు. చారిత్రక లేదా మతపరమైన ప్రాముఖ్యత ఉన్న నాలుగు ప్రదేశాలను యాత్రల ప్రారంభానికి ఎంచుకున్నట్లు స‌మాచారం.