కర్ణాటక ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బజరంగ్ బలిని ఎన్నికల్లోకి తెచ్చిందే కాంగ్రెస్ అంటూ ఆయన మండిపడ్డారు.
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బజ్‌రంగ్ దళ్ వివాదాన్ని ప్రస్తావించారు. బజరంగబలి ప్రశాంతంగా ఆలయంలో వున్నాడని.. కానీ ఆయనను ఎన్నికల ప్రచారంలోకి తీసుకెళ్లింది కాంగ్రెస్సేనంటూ అమిత్ షా చురకలంటించారు. శ్రీరాముడిని లాక్కొన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బజరంగబలిని అవమానిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పీఎఫ్ఐని నిషేధించాలన్న బీజేపీ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ అంగీకరించలేకపోతోందని అమిత్ షా దుయ్యబట్టారు.
పీఎఫ్ఐని నిషేధించడం వల్ల బీజేపీ కర్ణాటకను మాత్రమే కాకుండా భారతదేశ అంతర్గత భద్రతను కూడా పటిష్టం చేసిందన్నారు. అయితే పీఎఫ్ఐ డిమాండ్‌కు కట్టుబడి వున్న కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు రూ.10,0000 కోట్లు కేటాయిస్తానని హామీ ఇచ్చిందని అమిత్ షా ఫైర్ అయ్యారు. రైతు సంక్షేమం గురించి ఆ పార్టీ పట్టించుకోదని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసిందని ఆయన గుర్తుచేశారు. భారత రాజ్యాంగం మతం ఆధారంగా ఎలాంటి రిజర్వేషన్లను అనుమతించదని, లింగాయత్, ఎస్సీలు, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచామని అమిత్ షా తెలిపారు. కానీ ముస్లింలకు 6 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ చెబుతోందని ఆయన ఫైర్ అయ్యారు.
ముస్లింలకు రిజర్వేషన్‌లు కల్పించడం కోసం ఏ సామాజికవర్గం వాటాను తగ్గిస్తారో చెప్పాలని కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌ను అమిత్ షా కోరారు. ముస్లింల రిజర్వేషన్లను పునరుద్ధరించడానికి, లింగాయత్ రిజర్వేషన్లను తగ్గించడానికి బీజేపీ అనుమతించదని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. ఉత్తర కర్ణాటక రైతులకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని.. కర్ణాటక, గోవాలతో పాటు కేంద్రంలో వారి ప్రభుత్వాలు వుండేవని తెలిపారు. కానీ మహదాయి జల వివాదాన్ని కాంగ్రెస్ పరిష్కరించలేదని అమిత్ షా చురకలంటించారు. కానీ మోడీ ప్రభుత్వం వచ్చాక మూడు చోట్లా బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక అంతా మారిపోయిందని, ప్రధాని మోడీ వివాదాన్ని పరిష్కరించి ఉత్తర కర్ణాటకకు నీరొచ్చేలా చేశారని అమిత్ షా ప్రశంసించారు.
తాము ఎలాంటి హామీ ఇవ్వనప్పటికీ మోదీజీ ప్రధాని అయ్యాకా.. పేదలకు 4 లక్షల ఇళ్లు, 43 లక్షల మంది పేదలకు తాగునీరు, 48 లక్షల మరుగుదొడ్లు, 4 కోట్ల మంది పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు, 54 లక్షల మంది రైతులకు 10,000 కోట్లు, 1.38 లక్షల మంది పేదలకు ఉచిత ఆరోగ్య బీమా, 37 లక్షల మంది మహిళలకు గ్యాస్ సిలిండర్లు అందించారని హోంమంత్రి అన్నారు. లింగాయత్‌ల ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని.. కానీ ఈ వర్గం నుంచి సీఎంలుగా చేసిన నిజలింగప్ప, వీరేంద్ర పాటిల్‌ను ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు తొలగించారని అమిత్ షా గుర్తుచేశారు.
కాంగ్రెస్ ఇస్తోన్న హామీలు కర్ణాటక బడ్జెట్ కంటే ఎక్కువంటూ ఆయన సెటైర్లు వేశారు. కాంగ్రెస్ హయాంలో కర్ణాటకకు రూ.99,000 కోట్లు మాత్రమే వచ్చాయని.. కానీ మోడీ దానిని రూ.2,26,418 కోట్లకు పెంచారని అమిత్ షా తెలిపారు. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
