Karnataka Election Opinion Poll:కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుసగా రెండో సారి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నదని ఎడుప్రెస్ గ్రూప్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ తెలిపింది.
Karnataka Election Opinion Poll: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు మే 10వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. అలాగే.. మే 13న ఓట్ల లెక్కింపు జరుగనున్నది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఎన్నికల సమరం ఆరంభమైనట్లు ఈసీ ప్రకటించింది. ఈ మేరకు ఇప్పటికే ఎన్నికల ప్రవర్తన నియామావళి అమల్లోకి వచ్చింది.
ఇదిలా ఉంటే.. ఒపీనియన్ పోల్స్ సందడి కూడా మొదలైంది. వివిధ సంస్థలు ఒపీనియన్ పోల్స్ ను వెల్లడిస్తున్నాయి. తాజాగా ఎడ్యుప్రెస్ గ్రూప్ ఒపీనియన్ పోల్ ను వెల్లడించింది. కర్ణాటకలోని దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ సంస్థ సర్వే చేపట్టింది. అన్ని వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఈ సర్వేలో సీఎం బసవరాజ్ బొమ్మై సహా ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ పనితీరును అడిగి తెలుసుకుంది.
మొత్తానికి ఈ ఒపీనియన్ పోల్ ప్రకారం- ఈ ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి వచ్చేది బీజేపీనేనని అంచనా వేసింది. సంపూర్ణ మెజారిటీతో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించవచ్చని తెలిపింది. 1985 నుంచి కర్ణాటకలో వరుసగా రెండు ఎన్నికల్లో విజయం సాధించి ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవడం గమనార్హం.
ఎడుప్రెస్ గ్రూప్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ ప్రకారం.. మొత్తం 224 నియోజకవర్గాల్లో బీజేపీ 110-120 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొంది. మరోసారి కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర పోషించక తప్పదని అభిప్రాయపడింది. కాంగ్రెస్ కు 70-80 సీట్లు దక్కొచ్చని తెలిపింది. అదే సమయంలో జేడీఎస్ (జనతాదళ్-సెక్యులర్) 10-15 సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేయబడింది. ఇతరులు 4 నుండి 9 సీట్లు పొందవచ్చని అభిప్రాయపడింది.
బీజేపీకి 43 శాతం ఓట్లు
ఎడుప్రెస్ గ్రూప్ అనేది దక్షిణ భారతదేశ ఎన్నికల విశ్లేషణ సంస్థ. కర్ణాటకలోని 50 నియోజకవర్గాలు, 183 పోలింగ్ కేంద్రాల్లో 18,331 మంది మధ్య ఈ సర్వే నిర్వహించింది. సర్వే ప్రకారం బీజేపీకి 43 శాతం, కాంగ్రెస్‌కు 37 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. కర్ణాటక ప్రజలు బీజేపీ నేత బీఎస్‌కు మద్దతు ఇస్తున్నారని సర్వే వెల్లడించింది. యడ్యూరప్పను సీఎంగా చూడాలన్నారని వెల్లడించింది. సర్వే ప్రకారం.. రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడుగా యడ్యూరప్ప నిలిచారు. ఈ సర్వేలో పాల్గొన్న 23 శాతం మంది ప్రజలు యడ్యూరప్పను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నట్లు తెలిపింది.
మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత జగదీశ్ శెట్టర్ పాపులారిటీ పరంగా రెండో స్థానంలో ఉన్నారు. కాబోయే సీఎంగా 22 శాతం మంది ఆయనకే ప్రాధాన్యతనిస్తున్నారనీ, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య మూడో అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా. ఆయనను 20 శాతం మంది ఇష్టపడుతున్నారని సర్వే అభిప్రాయపడింది.
అదే సమయంలో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను సీఎంగా చూడాలని 19 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారనీ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్-సెక్యులర్ నాయకుడు హెచ్.డి. సర్వేలో పాల్గొన్న 10 శాతం మంది కుమారస్వామిని ఇష్టపడుతున్నారని, సర్వేలో పాల్గొన్న వారిలో కేవలం 5 శాతం మంది మాత్రమే ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని మళ్లీ సీఎం చేయాలని కోరుకుంటున్నారని వెల్లడించింది.
అవినీతి ఆరోపణల ప్రభావం
ప్రస్తుత సీఎం బొమ్మైపై అవినీతి ఆరోపణలు కూడా ప్రభావం చూపుతున్నట్లు సర్వేలో తేలింది. పార్టీలోని అంతర్గత విభేదాలు కూడా బీజేపీకి చేటు తెచ్చేలా కనిపిస్తున్నాయి. నాయకులను మార్చడం వల్ల ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు వస్తాయని చాలా మంది ఓటర్లు విశ్వసించారనీ, సర్వే ప్రకారం రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కొనసాగాలని ఓటర్లు కోరుకుంటున్నారు. ప్రస్తుతం బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ కూడా గట్టి పోటీనిస్తోందనీ, బి.ఎస్. యడ్యూరప్ప కర్ణాటకలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ఎదుగుతున్నారని సర్వే అభిప్రాయ పడింది.
