నియోజకవర్గ పర్యటనకు వెళ్లిన ఓ దళిత ఎంపీకి చేదు అనుభవం ఎదురైంది. చిత్రదుర్గ ఎంపీ (బీజేపీ) ఎ.నారాయణస్వామికి తన సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. సోమవారం ఆయన పెమ్మనహళ్లి గొల్లరహట్టి గ్రామంలో పర్యటనకు వెళ్లారు. ఆ గ్రామస్థులు పొలిమేర వద్ద ఎంపీని మూకుమ్మడిగా అడ్డుకున్నారు. దళితుడనే కారణంతో ఆయనను ఊళ్లో అడుగు పెట్టనీయలేదు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని విచ్ఛిన్నం చేయవద్దంటూ ఆయనకు సూచించారు.
 
45 నిమిషాలపాటు అక్కడే ఎదురుచూసిన ఎంపీ.. చివరకు వెనుదిరిగారు. ‘‘నేను ఇంకా ఐదేళ్లపాటు ఎంపీగా ఉంటా.. ఆలోపు ఆ గ్రామంలోకి ప్రవేశించి, అంటరానితనానికి తెరదించుతా’’ అని ప్రకటించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేస్తామని తుమకూరు డీసీపీ కె.రాకేశ్‌ కుమార్‌ తెలిపారు.