ఆంజనేయుడు కర్ణాటకలోని అంజనాద్రి కొండల్లో పుట్టాడంటూ కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మారోమారు చర్చకు తెరలేపారు. 

బెంగళూరు : హనుమంతుడు ఎక్కడ జన్మించాడు? ఆయన జన్మస్థలం ఏది? అనే అంశంమీద ఇటీవలికాలంలో విపరీతంగా చర్చ జరిగిన విషయం తెలిసిందే. తమ రాష్ట్రంలోని పుట్టాడని ఆంధ్ర ప్రదేశ్.. కాదు, కాదు మా దగ్గరే జన్మించాడని కర్ణాటక వాదులాడుకున్నాయి. హనుమంతుడు జన్మస్థలం తిరుమల అని నిరుడు ఏప్రిల్ లో తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. ఆంజనేయుడు అక్కడే పుట్టాడని బర్త్ సర్టిఫికెట్ కూడా ఉన్నంత బలంగా వాదించింది. అంతే కాదు సాక్షాలు ఇదిగో అంటే కొన్ని వివరాలను కూడా బయటపెట్టింది. పురాణాల్లో ఆ ప్రస్తావన ఉందని చెప్పుకొచ్చింది. 

అయితే అది శుద్ధ అబద్ధమని కర్ణాటకలోని కిష్కింద ట్రస్ట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హనుమంతుడు జన్మస్థలం కిష్కింధ అని వాదించింది. నాసిక్ సమీపంలోని అంజనేరిలో ఆంజనేయుడు జన్మించినట్లు మరికొందరు వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ చర్చకు పులిస్టాప్ పడింది.. గొడవ కాస్త సద్దు మణిగింది.. అనుకుంటున్న సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై మరోమారు చర్చకు తెరలేపారు. కొప్పాల్ జిల్లాలోని అంజనాద్రి కొండలు హనుమంతుడి జన్మస్థలంగా గుర్తింపు పొందాయని చెప్పుకొచ్చారు. 

‘హనుమంతుడు అంజనాద్రి కొండల్లో జన్మించాడు. కిష్కింధ (ప్రస్తుత హంపి)లో ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఆంజనేయుడు అక్కడ పుట్టాడు, ఇక్కడ పుట్టాడు అంటూ చాలా మంది.. చాలా చెబుతున్నారు. కానీ హనుమంతుడి నిజమైన జన్మస్థలం ఇదే.. కిష్కింద లోని అంజనాద్రి కొండల్లోనే ఆయన జన్మించాడు. ఇందులో ఎలాంటి గందరగోళానికి తావులేదు’ అని బొమ్మై స్పష్టం చేశారు. 

ఆగ‌స్టు 6న ప్ర‌ధాని అధ్య‌క్ష‌త‌న ‘అజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్’ మీటింగ్.. సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టే ఛాన్స్ ?

ఇదిలా ఉండగా జూలై 31న ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రే అని.. దీని మీద త్వరలో ఆధారాలతో పుస్తకం తీసుకువస్తామని టీటీడీ తెలిపింది. ఇప్పటికే శేషాచలం కొండలే ఆంజనేయుడి జన్మస్థలమని టీటీడీ చెబుతోంది. ఈ అంశంపై రెండు రోజుల పాటు అంతర్జాతీయ వెబినార్ కుడా నిర్వహించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఈ వెబినార్ లో పలువురు పీఠాధిపతులు, పండితులు పాల్గొన్నట్లు తెలిపారు ఈ మేరకు సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు.

అంజనాద్రి హనుమంతుడు జన్మస్థలంగా నిర్ధారించేందుకు పండిత పరిషత్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పలు ఆధారాలతో అంజనాద్రిని హనుమంతుని జన్మస్థలము గుర్తించినట్లు ధర్మారెడ్డి వివరించారు. ఆధారాలతో త్వరలో పుస్తకం తీసుకురానున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తమకు లభ్యమైన ఆధారాలు, శాసనాల ప్రకారం హనుమంతుడు జన్మస్థలంపై ప్రకటన చేశామని టీటీడీ తెలిపింది. ఈ వివాదం ఇంకా కొనసాగుతున్న క్రమంలోనే తాజాగా బసవరాజ్ బొమ్మ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.