కర్ణాటక లో అధికారాన్ని మళ్లీ చేజిక్కించుకునే అవకాశాలు తమకున్నాయని మాజీ ముఖ్యమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అధికారం రావాలంటే ప్రతి బిజెపి కార్యకర్త, నాయకులు జేడియస్ ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకోవాలని సూచించారు. అవసరమైతే వారి ఇళ్లకు వెళ్లి వారిని బిజెపికి మద్దతిచ్చేలా ఒప్పించాలని సూచించారు. 

ఇటీవల ఎన్నికల తర్వాత బిజెపి ఏర్పాటు చేసిన ఎగ్జిక్యూటివ్ కమిటీ తొలి సమావేశంలో ఆయన మాట్లాడారు. బిజెపిలోకి జెడిఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా చేజారిక అధికారాన్ని మళ్లీ  పొందవచ్చని ఆయన అన్నారు. మన ప్రభుత్వం రావాలని కర్ణాటక ప్రజలు ఇంకా ఎదురుచూస్తున్నారని యడ్యూరప్ప అన్నారు.

ఇక రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి పార్టీకి గెలిపించి మరోసారి మోదీని ప్రధానిని చేయాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు.  అందుకే కాంగ్రెస్, జేడిఎస్ పార్టీల్లోని అసంతృప్త నేతలను బిజెపిలోకి తీసుకురావాలని సూచించారు. కర్ణాటక తో పాటు దేశ అభివృద్దికి పాటుపడే వారందరూ ఏకమవ్వాల్సిన సమయం వచ్చిందని యడ్యూరప్ప సూచించారు.

రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను గమనిస్తే కాంగ్రెస్,జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఐదేండ్లు పాలించడం కష్టంగా కనిపిస్తోందని అన్నారు. అయితే ప్రభుత్వాన్ని కూల్చడానికి మాత్రం తాము ప్రయత్నించమని అన్నారు. బడ్జెట్ సమావేశాల తర్వాత బిజెపి పార్టీ తమ దూకుడును పెంచుతుందని యడ్యూరప్ప స్పష్టం చేశారు.