కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ శనివారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలి జాబితాను శనివారం విడుదల చేసింది.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మరోవైపు అభ్యర్థుల జాబితాను కూడా సిద్దం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ శనివారం.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలి జాబితాను శనివారం విడుదల చేసింది. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉండగా.. అందులో 124 స్థానాలకు అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేయడం గమనార్హం. ఈ జాబితాలో పార్టీ ముఖ్య నాయకులు పోటీ చేసే స్థానాలపై కూడా కాంగ్రెస్ అధిష్టానం స్పష్టతనిచ్చింది.
వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ సీఎం సిద్దరామయ్య, కనకపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ పోటీ చేస్తారని తెలిపింది. కొరటగెరె (ఎస్సీ) నియోజకవర్గం నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి జి పరమేశ్వరను పార్టీ బరిలోకి దింపింది. మాజీ మంత్రులు కేహెచ్ మునియప్ప- దేవనహళ్లి, ప్రియాంక్ ఖర్గే-చితాపూర్ (ఎస్సీ) నుంచి పోటీ చేయనున్నారు. ప్రియాంక్ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కుమారుడు అన్న సంగతి తెలిసిందే.
అయితే ప్రస్తుతం మైసూరులోని వరుణ నియోజకవర్గం నుంచి సిద్దరామయ్య తనయుడు యతీంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. సిద్దరామయ్య ప్రస్తుతం రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతంలోని బాగల్‌కోట్ జిల్లాలోని బాదామి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఈ సారి వరుణ నుంచి సిద్దరామయ్య బరిలో దిగనున్నారు. ఇక, డీకే శివకుమార్ ప్రస్తుతం కనకపుర సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
మార్చి 17న ఢిల్లీలో జరిగిన సమావేశం తర్వాత పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ అభ్యర్థుల తొలి జాబితాను క్లియర్ చేసింది. ఈ కమిటీకి కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. ఇక, కర్ణాటక ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన తొలి పార్టీగా కాంగ్రెస్ నిలిచింది. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించలేదు. కర్ణాటక అసెంబ్లీ ప్రస్తుత పదవీకాలం మే నెలతో ముగియనుండగా.. ఆలోపు అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో బీజేపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
