Karnataka Election 2023: త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న కర్ణాటకలో ప్రధాని మోడీ మ‌రోసారి పర్యటనకు రానున్నారు. ఈ నెల 12న కర్ణాటకలోని మాండ్యా, హుబ్బళ్లి-ధార్వాడ్ జిల్లాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తారని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. 

PM to visit Karnataka on March 12: క‌ర్నాట‌క అసెంబ్లీకి త‌ర్వ‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు ఇప్ప‌టికే ఎన్నిక‌ల ప్ర‌చారం ముమ్మ‌రం చేశాయి. మ‌రోసారి అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) ప‌క్కా వ్యూహాల‌తో ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగా బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం వ‌రుసగా ఎన్నిక‌ల ప్ర‌చారం చేయ‌డానికి ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసిన‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే ప్రధాని న‌రేంద్ర‌ మోడీ మ‌రోసారి రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ నెల 12న కర్ణాటకలోని మాండ్యా, హుబ్బళ్లి-ధార్వాడ్ జిల్లాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తారని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. మార్చి 12న కర్ణాటకలోని మాండ్యా, హుబ్బళ్లి-ధార్వాడ్ జిల్లాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తారని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ ఏడాది ప్రారంభం నుండి, ప్రధాని మోడీ వివిధ ప్రాజెక్టులు, పథకాలకు శంకుస్థాపన చేయడానికి లేదా ప్రారంభించడానికి తరచుగా రాష్ట్రానికి వస్తున్నారు. భారీ బహిరంగ సభలలో ప్రసంగిస్తున్నారు. ఈ ఏడాది మేలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున కర్ణాటకలో అధికార బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ.. వ‌రుస‌గా అగ్ర‌నాయ‌క‌త్వంతో ప్రచారం సాగిస్తోంది. ఈ నెల 12న కర్ణాటకలో పర్యటించి మాండ్య జిల్లా మద్దూరులో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారనీ, ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు హుబ్బళ్లికి చేరుకుని ఐఐటీ ధార్వాడ్ ను ప్రారంభిస్తారనీ, ఆ తర్వాత సమీపంలోని భారీ బహిరంగ సభలో ప్ర‌ధాని మోడీ ప్రసంగిస్తారని జోషి తెలిపారు.

ఈ పర్యటనపై ప్రధాని కార్యాలయం నుంచి అధికారిక ధ్రువీకరణ ఉందని జోషి విలేకరులతో చెప్పారు. మద్దూరులో కూడా ఇంత పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించడం ఇదే తొలిసారి. ప్రధాని మోడీ వచ్చినప్పుడు గుమిగూడే భారీ జనసందోహానికి వసతి కల్పించడానికి మాండ్య, పరిసర ప్రాంతాల్లో అంత పెద్ద మైదానం లేనందున ఈ సమావేశం కోసం ప్ర‌యివేటు స్థలాన్ని తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కాగా, రాబోయే ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ సాధించడానికి మాండ్య ప్రధాన భాగమైన వొక్కలిగ కమ్యూనిటీ అధికంగా ఉంటుంది. పాత మైసూరు ప్రాంతమైన ఇక్క‌డ ఎక్కువ స్థానాలను గెలుచుకోవడంపై బీజేపీ దృష్టి సారించిందని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.

అయితే, ఈ ప్రాంతంలో బీజేపీ బలహీనంగా ఉందని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. బీజేపీని బలోపేతం చేయాల్సిన ప్రాంతం మాండ్య అనీ, ప్రధాని పర్యటన ఏర్పాట్లపై చర్చించడానికి తాను ఇటీవల అధికారులు, పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించానని చెప్పారు. రాష్ట్రంలో వాతావరణం బీజేపీకి అనుకూలంగా మారుతోందనీ, మోడీ నాయకత్వంలో పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కొనసాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. కాగా, ప్రస్తుతం బీజేపీ కర్నాటక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని విజయ సంక‌ల్ప యాత్ర‌ను చేప‌ట్టింది. వివిధ ప్రాంతాల్లో బీజేపీ అగ్ర‌నాయ‌కులు ఈ యాత్ర‌ ర్యాలీలను ప్రారంభించారు.