ప్రముఖ కన్నడ నటుడు కిచ్చా సుదీప్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. 51 ఏళ్ల ఈ నటుడు ఓ పార్టీ తరపున ప్రచారం నిర్వహించడం, రాజకీయాల్లోకి ప్రవేశించడం ఇదే తొలిసారి.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, రెండో సారి అధికారాన్ని నిలుపుకోవాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీని కోసం ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ప్రముఖులు ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే వారితో పాటు ఈ ప్రచారంలో సినిమా స్టార్ లను చేర్చుకోవడంపై దృష్టి సారించింది.
నడి వీధిలో మహిళ ముక్కుకోసిన వ్యక్తి.. వేధింపుల కేసు పెట్టిందని మూడేళ్ల తరువాత ప్రతీకారం..
కర్నాటక వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాషాయ పార్టీ తన స్టార్ క్యాంపెయినర్లుగా ఉండేందుకు పలువురు కన్నడ నటులను సంప్రదించింది. వారిలో కిచ్చా సుదీప్ అని పిలిచే విక్రాంత్ రోనా స్టార్ సుదీప్ సంజీవ్ కూడా ఉన్నారని వర్గాలు తెలిపాయని ‘ఇండియా టుడే’ తన కథనంలో నివేదించింది. కిచ్చా సుదీప్ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఇదే తొలిసారి. ఆయన కళ్యాణ-కర్ణాటక ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ తరపున ప్రచారం చేస్తారని వర్గాలు తెలిపాయి.
51 ఏళ్ల కిచ్చా సుదీప్ రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల జాబితా కింద నోటిఫై చేయబడిన నాయక కులానికి చెందిన వ్యక్తి. ఆయన సామాజిక వర్గానికి కళ్యాణ-కర్ణాటక ప్రాంతంలో పట్టు ఉంది. అలాగే కిచ్చా సుదీప్‌కి భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. ఈ అంశాలన్నీ తమకు అనుకూలంగా మారుతాయని బీజేపీ లెక్కలు వేస్తోంది.
అయితే ఇక్కడ ఆసక్తికరమైన మరో విషయం ఏంటంటే ఫిబ్రవరిలో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ కిచ్చా సుదీప్ నివాసంలో అతనిని కలిశారు, దీంతో ఆయనకు, ప్రతిపక్ష పార్టీ మధ్య కొన్ని రకాల రాజకీయ చర్చలు జరుగుతున్నాయని ఊహాగానాలు వచ్చాయి. కానీ ఈ సమావేశంలో రాజకీయ ఉద్దేశాలు లేవని, ఇది పూర్తిగా వ్యక్తిగతం అని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు.
కన్నతండ్రే కాల యముడయ్యాడు.. ఇద్దరు కుమార్తెలను గొడ్డలితో నరికి హత్య.. అడ్డొచ్చిన భార్య,మనవడిపై..
కాగా.. కర్నాటకలో మే 10వ తేదీన ఎన్నికలు జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్, జేడీ(ఎస్)లు వరుసగా 124, 93 మంది అభ్యర్థులతో ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించాయి. ఏప్రిల్ 8న పార్టీ కేంద్ర నాయకత్వం ఖరారు చేసిన తర్వాత బీజేపీ తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు.
