ఓవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుండగానే ఓ వృద్దుడు ఓటుహక్కును వినియోగించుకున్నాడు. 

బెంగళూరు : కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. కీలకమైన పోలింగ్ ప్రక్రియ ఈ నెల 10న జరగనుండటంతో రాజకీయ పార్టీల ప్రచారం మరింత జోరందుకుంది. ఇలా కన్నడ ప్రజలు ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఇంకా వారంరోజుల సమయం వుంది... కానీ ఓ శతాదిక వృద్దుడు మాత్రం ఇప్పటికే ఓటు వేసేసాడు. ఓవైపు ఎన్నికల ప్రచారం జరుగుతుండగానే అతడికి ఓటేసే అవకాశాన్ని ఎన్నికల సంఘమే కల్పించింది. 

కరోనా మహమ్మారి దెబ్బకు అన్ని రంగాల్లోనూ అనేక మార్పులు జరిగాయి. ఇలా ఎన్నికల నిర్వహణలోనూ మార్పులు చేపట్టింది భారత ఎన్నికల సంఘం. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం మాదిరిగా కరోనాతో బాధపడుతున్నవారితో పాటు వృద్దులకు వోట్ ఫ్రం హోం సదుపాయాన్ని కల్పించింది ఈసీ. అంటే 80 ఏళ్లు పైబడి పోలింగ్ బూత్ వరకు నడిచే పరిస్థితిలో లేని వృద్దులు ఇంటివద్దే వుండి ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం కల్పించింది. ఇలా ఇంటినుండే ఓటు హక్కును వినియోగించుకుంటామని ముందుగానే ఈసీకి సమాచారమిస్తే అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పోలింగ్ రోజుకంటే ముందే ఓటేయవచ్చన్న మాట. 

ఎన్నికల కల్పించిన ఈ అవకాశాన్ని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించుకున్నాడు ఓ శతాధిక వృద్దుడు. బెళగావి జిల్లాలోని చిక్కోడికి చెందిన మహాదేవ మహాలింగమాలి 103 ఏళ్ల వయసులోనూ ఓటేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే వృద్దాప్యంతో పోలింగ్ బూత్ వరకు వెళ్లలేడు కాబట్టి ఇంటి నుండే ఓటేస్తానని ఈసిని కోరారు. దీంతో ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆయన ఇంటికి వెళ్లి ఓటు వేయించారు. రహస్యంగా తనకు ఇష్టమైనవారికి ఆయన ఓటేయగా ఆ బ్యాలెట్ పేపర్ ను అధికారులు తీసుకున్నారు. అనంతరం ఓటేసినట్లు అతడి వేలికి సిరా అంటించారు. 

Read More టైం బాలేదా.. హెలిప్యాడ్‌లో మంటలు, మరోసారి తృటిలో తప్పించుకున్న డీకే శివకుమార్

ఇలా వందేళ్ల వయసులోనూ ఓటేసేందుకు సిద్దపడ్డ మహాదేవను కర్ణాటక ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ ఫోన్ చేసి అభినందించారు. ఆరోగ్యం సహకరించకున్నా ఇంటినుండే ఓటు వేసే అవకాశాన్ని వినియోగించుకున్న ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. ఈయనలాగే వృద్దాప్యంలో వున్న ఎవరైనా ఇంటివద్దే ఓటుహక్కుకు వినియోగించుకోవచ్చని సీఈవో రాజీవ్ కుమార్ తెలిపారు.

ఇక తనకు ఇంటివద్దే ఓటేసే అవకాశం కల్పించిన ఈసికి మహాదేవ మహాలింగ కృతజ్ఞతలు తెలిపారు. గత ఎన్నికల్లో వీల్ చైర్ పై పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటేసానని... అక్కడివరకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డానని తెలిపాడు. కానీ ఇప్పుడిలా ఇంట్లోనే కూర్చుని ఓటుహక్కును వినియోగించుకోవడం చాలా ఆనందంగా వుందన్నారు శతాధిక వృద్దుడు మహాదేవ.