కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ మరోసారి తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ల్యాండైన కాసేపటికే హెలిప్యాడ్‌లో మంటలు చెలరేగాయి. 

కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు టైం అస్సలు బాగోనట్లుగా వుంది. కొద్దిరోజుల క్రితం ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ను పక్షి ఢీకొట్టింది. అయితే పైలట్లు అత్యంత చాకచక్యగా వ్యవహరించడంతో శివకుమార్ ప్రాణాలతో బయటపడ్డారు. తాజాగా మరోసారి డీకే తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ల్యాండైన కాసేపటికే హెలిప్యాడ్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనతో కాంగ్రెస్ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. అయితే డీకే సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

ALso Read: డీకే శివకుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను ఢీకొట్టిన పక్షి.. తప్పిన ప్రమాదం..

కాగా.. మే 2వ తేదీన ఉదయం బెంగళూరు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు శివకుమార్. అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు హెలికాప్టర్‌లో ముళబాగిలుకు బయలుదేరారు. దాదాపు 12 గంటల ప్రాంతంలో జక్కూరు నుంచి డీకే శివకుమార్ హెలికాప్టర్ బయలుదేరింది. అయితే కొద్దిసేపటికే శివకుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ హెచ్‌ఏఎల్‌ విమానాశ్రయానికి 40 కిలోమీటర్ల దూరంలోని హోసకోటే సమీపంలో గాలిలో ఉండగానే ఒక డేగ ఢీకొట్టింది. దీంతో హెలికాప్టర్‌ను హెచ్‌ఏఎల్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అయితే పైలెట్ చాకచాక్యంగా వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పిందని డీకే శివకుమార్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ ముందు భాగం దెబ్బతింది. ముందు అద్దం కొంత భాగం పగిలిపోయింది.