సారాంశం
Karnataka Assembly Election 2023: మైసూరులో రోడ్ షోలో ప్రధాని మోడీ కాన్వాయ్ పై సెల్ ఫోన్ విసిరారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రచారాన్ని మరింతగా పెంచడానికి ప్రధాని మోడీ మైసూరులో తన మద్దతుదారులతో సమావేశమవుతున్న సమయంలో, ఒక మొబైల్ ఫోన్ ను జనం లోపలి నుండి గుర్తుతెలియని వ్యక్తి ప్రధాని కాన్వాయ్ పైకి విసిరాడు.
Mobile phone thrown at PM Modi's convoy during roadshow: ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో రోజైన ఆదివారం భారీ రోడ్ షో నిర్వహించారు. సుడిగాలి పర్యటనలో భాగంగా మైసూరులో ఆరు బహిరంగ సభలు, రోడ్ షోలలో పాలుపంచుకున్నారు. అయితే, మైసూరులో రోడ్ షోలో ప్రధాని మోడీ కాన్వాయ్ పై సెల్ ఫోన్ విసిరారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రచారాన్ని మరింతగా పెంచడానికి ప్రధాని మోడీ మైసూరులో తన మద్దతుదారులతో సమావేశమవుతున్న సమయంలో, ఒక మొబైల్ ఫోన్ ను జనం లోపలి నుండి గుర్తుతెలియని వ్యక్తి ప్రధాని కాన్వాయ్ పైకి విసిరాడు.
రోడ్ షోకు సంబంధించిన వీడియోలో, జనం వైపు చేతులు ఊపుతూ ప్రధాని మోడీ ముందు దిగినప్పుడు ఒక ఫోన్ వాహనం వైపు విసరడం కనిపించింది. అయితే, ఇది కావాలని చేసిన పనికాదని ప్రాథమికంగా నిర్ధారించినట్టు సమాచారం. ప్రధానిపై పూలు విసురుతున్న సమయంలో గుంపులోని ఎవరో పొరపాటుగా ప్రమాదవశాత్తు మొబైల్ ను విసిరినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఎలాంటి దురుద్దేశం లేని ఓ మహిళా బీజేపీ కార్యకర్త ఉత్సాహంతో ఫోన్ విసిరినట్లు పోలీసులు తెలిపారు.
"ప్రధాని ఎస్పీజీ రక్షణలో ఉన్నారు. ఆ మహిళ బీజేపీ కార్యకర్త, ఆమె ఫోన్ ప్రధాని కాన్వాయ్ పై పడింది. ఆ తర్వాత ఎస్పీజీ సిబ్బంది ఆమెకు ఫోన్ తిరిగి ఇచ్చారు" అని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) అలోక్ కుమార్ తెలిపారు. కాగా, ప్రధాని రోడ్ షో నగరంలోని వివిధ ప్రాంతాల గుండా సాగింది. రోడ్ షోలో ప్రధాని సంప్రదాయ మైసూరు 'పేట', కాషాయ శాలువా ధరించారు. రోడ్డుకు ఇరువైపులా గుమిగూడిన పెద్ద సంఖ్యలో ప్రజలను చూసి చేతులు ఊపుతూ అభివాదం చేశారు. ప్రజలు ఆయనపై పూల వర్షం కురిపించారు.
బీజేపీ జెండాలు, ఫెస్టూన్లు, ప్రధాని మోడీ పోస్టర్లు, కటౌట్లు రోడ్లపై భారీగా కనిపించాయి. బీదర్ జిల్లా హుమ్నాబాద్, బెళగావి జిల్లా కుడాచిలో ప్రధాని మోడీ బహిరంగ సభలు, బెంగళూరులో రోడ్ షో నిర్వహించారు. ఆదివారం ఆయన కోలార్ నగరం, రామనగర జిల్లాలోని చెన్నపట్న, హసన్ జిల్లాలోని బేలూరులో ఎన్నికల ర్యాలీల్లో పాల్గొని, మైసూరులో రోడ్ షోతో ముగించారు. కాగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్ని ప్రధాన పార్టీలు భావిస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే 10న జరగనుండగా, మే 13న ఫలితాలు వెలువడనున్నాయి.