కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సిద్దంచేసిన భారీ నగదుతో పాటు బంగారంతో పాటు వివిధ రకాల బహుమతులు పోలీసులు, ఐటీ దాడుల్లో పట్టుబడుతున్నాయి. 

బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ధనప్రవాహం యధేచ్చగా సాగుతోంది. ఓ ఎమ్మెల్యే అభ్యర్థి సోదరుడు ఇంటి పెరట్లోని మామిడి చెట్టుపై కోటి రూపాయలు దాచాడంటేనే ధనప్రవాహం ఏ స్థాయిలో జరుగుతుందో అర్థమవుతుంది. ప్రచార సమయంలోనే పరిస్థితి ఇలావుంటే పోలింగ్ ముందు భారీగా నగదు పంచే అవకాశాలుండటంతో ఎన్నికల కమీషన్, పోలీసులతో పాటు ఐటీ శాఖ అప్రమత్తం అయ్యింది. దీంతో కేవలం ఐటీ శాఖ చేపట్టిన సోదాల్లోనే రూ.22 కోట్ల సొత్తు పట్టుబడింది. 

కర్ణాటక ఆదాయపన్ను శాఖ అధికారులు వివిధ ప్రాంతాల్లో చేపట్టిన సోదాల్లో భారీగా నగదు, బంగారం, ఇతర వస్తువులు పట్టుబడ్డాయి. ఎలాంటి లెక్కాపత్రం లేకుండా దాచిన రూ.15 కోట్ల పైచిలుకు నగదుతో పాటు 10కిలోలకు పైగా బంగారాన్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఐటీ శాఖ కార్యాలయం నుండి ఓ ప్రకటన వెలువడింది.

ఇలా కర్ణాటకలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన మార్చి 29 నుండి ఇప్పటివరకు పోలీసులు, ఐటీ సిబ్బంది చేపట్టిన దాడుల్లో రూ.365 కోట్ల సొత్తు పట్టుబడినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో అత్యధికంగా వంద కోట్లకు పైగా నగదే పట్టుబడింది. ఇక కోట్ల విలువచేసే బంగారం, మద్యం కూడా పోలీసుల తనిఖీల్లో పట్టుబడింది. 

ఇదిలావుంటే ఇటీవల చెట్లపై, గోనె సంచుల్లో కోట్లకు కోట్ల కరెన్సీ కట్టలు పోలీసులు, ఐటీ తనికీల్లో పట్టుబడుతున్నాయి. కోలార్ జిల్లాలో ఓ రియల్టర్ గన్నీ బ్యాగుల్లో నోట్ల కట్టలు తరలిస్తున్నాడని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అతడి విల్లాపై దాడులు చేయగా రూ.4.5 కోట్ల నగదు పట్టుబడింది.దీంతో ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 

Read More బజరంగ్ దళ్‌ పరువు తీశారంటూ ఆగ్రహం .. రూ.100 కోట్లు చెల్లించండి : మల్లిఖార్జున ఖర్గేకు వీహెచ్‌పీ లీగల్ నోటీసులు

దక్షిణ కన్నడ జిల్లాలో పుత్తూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున అశోక్ కుమార్ రాయ్ పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తూ అశోక్ రాయ్ సోదరుడు సుబ్రహ్మణ్య రాయ్ ఇంట్లో భారీగా నగదు దాచినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఇంటి ఆవరణలో ఓ మామిడి చెట్టుపై అతడు దాచిన బాక్స్ లో కోటి రూపాయల నగదును గుర్తించారు. ఆ నగదుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు చూపించకపోవడంతో ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

ఇక బెంగళూరులో ఇలాగే సామాన్యుల మాదిరి ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరిపై అనుమానంతో పోలీసులు అడ్డుకున్నారు. వారివద్ద గత బ్యాగులను తెరిచిచూడగా నోట్ల కట్టలు బయటపడ్డారు. మొత్తం కోటి రూపాయల నగదును ఎలాంటి పత్రాలు లేకుండా తీసుకెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ డబ్బును స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

ఇలా కర్ణాటక ఎన్నికలో కోట్లకు కోట్ల డబ్బులు అధికారంగానే పట్టుబడుతున్నాయి. పట్టుబడిన సొత్తే ఈ స్థాయిలో వుంటే ఇక రహస్యంగా ఓటర్లకు పంచుతున్న నగదు, మద్యం, బహుమతుల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నెల 10న పోలింగ్ ముగిసేసరికి ఈ ధనప్రవాహం ఆగేలా కనిపించడం లేదు. ఎన్నికల కమీషన్, పోలీసులు, ఐటీ... ఎవరేం చేసినా ధనప్రవాహాన్ని నియంత్రించగలరేమో కానీ ఆపలేరన్నది అందరికీ తెలిసిన నిజం.