Asianet News TeluguAsianet News Telugu

పీకే భేటీతో మారుతున్న రాజకీయం .. ఏఐసీసీలో కదలిక, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కమల్‌నాథ్..?

జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలన్నిటినీ కాంగ్రెసే సమన్వయ పరచాలని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ సూచించడంతో.. ఇందుకు కమల్‌నాథ్‌ సమర్థుడని కాంగ్రెస్‌ అధిష్ఠానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సోనియా గాంధీతో కమల్ నాథ్ భేటీ అయ్యారు.
 

kamalnath meet congress chief sonia gandhi ksp
Author
New Delhi, First Published Jul 15, 2021, 2:53 PM IST

కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ గురువారం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు వీరిద్దరి భేటీ జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు మరికొన్ని కీలకమైన అంశాలను ఈ సమావేశంలో చర్చించారు. కమల్‌నాథ్‌ను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించనున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. కొన్ని రోజుల క్రితమే పార్టీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Also Read:కాంగ్రెస్‌లోకి ప్రశాంత్ కిశోర్ .. ఢిల్లీ వర్గాల్లో ఊహాగానాలు..?

జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలన్నిటినీ కాంగ్రెసే సమన్వయ పరచాలని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ సూచించడంతో.. ఇందుకు కమల్‌నాథ్‌ సమర్థుడని కాంగ్రెస్‌ అధిష్ఠానం భావిస్తోంది. అన్ని పార్టీలతో ఆయనకు సత్సంబంధాలు ఉండడమే దీనికి కారణం. బీజేపీయేతర పార్టీలను కూడగట్టగలరన్న నమ్మకంతో ఆయన్ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించే అవకాశాలున్నాయని కాంగ్రెస్‌ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బుధవారం జరిగిన కాంగ్రెస్‌ పార్లమెంటరీ వ్యూహ బృందం సమావేశంలో దీనితో సహా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కమల్‌నాథ్‌ను నియమించి, సోనియాగాంధీ పూర్తి స్థాయి అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తారని ఢిల్లీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios