సింథియాకు బిజెపి ఆఫర్ ఇదే: మైనారిటీలో కమల్ నాథ్ ప్రభుత్వం
కాంగ్రెసుకు రాజీనామా చేసి తమ పార్టీలో చేరడానికి సిద్ధపడిన జ్యోతిరాదిత్య సింథియాకు బిజెపి బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, సింథియా వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు.
న్యూఢిల్లీ: కాంగ్రెసుకు రాజీనామా చేసిన జ్యోతిరాదిత్య సింథియాకు బిజెపి రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. దాంతో పాటు విస్తరణలో ఆయనకు కేంద్ర మంత్రి పదవి కూడా ఇవ్వనున్నారు. ఆయన కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం ఆయన బిజెపిలో చేరే అవకాశం ఉంది.
కాగా, ఆయన వర్గానికి చెందిన 14 మంది శాసనసభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. మరో ముగ్గురు రాజీనామా చేయనున్నారు. 14 మంది శాసనసభ్యుల రాజీనామా లేఖలు రాజ్ భవన్ కు చేరాయి. 25 మంది శాసనసభ్యులు రాజీనామా చేయడానికి సిద్ధపడినట్లు తొలుత వార్తలు వచ్చాయి.
Also Read: ఫలించిన బిజెపి వ్యూహం: కాంగ్రెసుకు జ్యోతిరాదిత్య సింథియా రాజీనామా
దాంతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడడం ఖాయంగా కనిపిస్తోంది. మంగళవారం ఉదయానికి కమల్ నాథ్ ప్రభుత్వానికి 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఇది మెజారిటీ కన్నా నాలుగు ఎక్కువ. ఎమ్మెల్యేల రాజీనామాలను శాసనసభలో మెజారిటీకి 106 మంది సభ్యుల బలం ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం బిజెపికి 107 మంది సభ్యులున్నారు.
Also read: కమల్ నాథ్ అవుట్: ఎంపీ లోనూ కర్ణాటక ఫార్ములా, లెక్కలు ఇవీ!
పార్టీ నుంచి జ్యోతిరాదిత్య సింథియాను బహిష్కరించినట్లు కాంగ్రెసు సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆయనను బహిష్కరించినట్లు తెలిపారు. తన రాజీనామా లేఖను సింథియా ట్విట్టర్ ద్వారా సోనియా గాంధీకి పంపిన తర్వాత కొద్ది నిమిషాలకే కేసీ వేణుగోపాల్ ప్రకటన వెలువడింది.