న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెసు నేతృత్వంలోని కమల్ నాథ్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. జ్యోతిరాదిత్య సింథియా కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ తర్వాత ఆయన కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు. 

కేంద్ర హోం మంత్రి అమిత్ షాను వెంటపెట్టుకుని సింథియా నరేంద్ర మోడీని కలిశారు. తన రాజీనామా లేఖను సింథియా కాంగ్రెసు తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించారు. 

 

Also Read: పతనం అంచులో కమల్నాథ్ ప్రభుత్వం: ప్రధానితో సింథియా భేటీ

మధ్యప్రదేశ్ లో కాంగ్రెసు ప్రభుత్వాన్ని కూల్చడానికి బిజెపి రచించిన వ్యూహం ఫలించింది.  ఏడాది కాలంగా కాంగ్రెసును వీడాలని అనుకుంటున్నట్లు జ్యోతిరాదిత్య సింథియా చెప్పారు. తన భవిష్యత్తును నిర్ణయించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన అన్నారు. 18 ఏళ్లుగా ఆయన కాంగ్రెసులో ఉన్నారు.

జ్యోతిరాదిత్య సంథియా కేంద్ర మంత్రిగా పనిచేశారు. నాలుగు సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. సింథియాను బిజెపి రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశం ఉంది.  తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేశారని కాంగ్రెసు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు.

కాగా, జ్యోతిరాదిత్య సింథియాను పార్టీ నుంచి బహిష్కరించినట్లు కాంగ్రెసు సీనయర్ నేత కేసీ వేణుగోపాల్ చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

 

Also Read: కమల్ నాథ్ అవుట్: ఎంపీ లోనూ కర్ణాటక ఫార్ములా, లెక్కలు ఇవీ!

జ్యోతిరాదిత్య వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన నేపథ్యంలో మధ్యప్రదేశ్ బిజెపి శాసనసభ్యులు మంగళవారం సాయంత్రం సమావేశం కానున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమకు అవకాశం కల్పించాలని వారు గవర్నర్ ను కోరే అవకాశం ఉంది.

కాంగ్రెసుకు చెందిన 14 మంది శాసనసభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో కమల్ నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయే అవకాశం ఉంది.