భోపాల్: ముఖ్యమంత్రి కమల్నాథ్ నేతృత్వంలోని కాంగ్రెసు ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో పడింది. జ్యోతిరాదిత్య సింథియాకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. వీరిలో ఆరుగురు మంత్రులున్నారు. అంతేకాకుండా, సింథియా ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంట వెళ్లి సింథియా ప్రధానిని కలిశారు. 

సింథియా వర్గం బిజెపిలో చేరుతుందా, సింథియా వర్గానికి బిజెపి మధ్యప్రదేశ్ లో మద్దతు ఇస్తుందా అనేది తేలాల్సి ఉంది. సింథియా వర్గానికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు బెంగళూరులో ఉన్న విషయం తెలిసిందే. కాంగ్రెసు జాతీయ నాయకులతో మాట్లాడడానికి కూడా సింథియా ఇష్టపడడం లేదు.  

బెంగళూరులోని రిసార్టులో ఉన్న 17 మంది శాసనసభ్యులు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. దాదాపు 20 మంది శాసనసభ్యులు సింథియాకు మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. సింథియా వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు బెంగళూరుకు తరలి వెళ్లడం, వారు కాంగ్రెసు నేతలకు అందుబాటులోకి రాకపోవడంతో కమల్నాథ్ జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నించారు. 

సోమవారం సాయంత్రం కమల్నాథ్ మంత్రులతో, సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. వారు ముఖ్యమంత్రి కమల్నాథ్ పట్ల పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. మంత్రివర్గ విస్తరణకు వెసులుబాటు కల్పిస్తూ మంత్రులు రాజీనామా లేఖలు ఇచ్చారు. 

సింథియా కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరడానికి సిద్ధపడినట్లు కూడా చెబుతున్నారు. సింథియాకు కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సీటు ఆపర్ చేసింది. కమల్నాథ్ ను ముఖ్యమంత్రిగా కొనసాగిస్తూ సింథియాను రాజ్యసభకు పంపించే ఫార్ములాను కాంగ్రెసు రూపొందించింది. అయితే, దానికి సింథియా సుముఖంగా లేరు.

కమల్నాథ్ ప్రభుత్వానికి 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మెజారిటీకి నలుగురు మాత్రమే ఎక్కువగా ఉన్నారు. శాసనసభలో మొత్తం 230 సీట్లు ఉండగా మెజారిటీకి 116 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసర పడుతుంది. కమల్నాథ్ ప్రభుత్వానికి 114 మంది కాంగ్రెసు, ఇద్దరు బిఎస్పీ, ఒకరు ఎస్పీ శాసనసభ్యులతో పాటు నలుగురు ఇండిపెండెంట్లు మద్దతు ఇస్తున్నారు. 

బిజెపికి 107 మంది శాసనసభ్యులున్నారు. రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. 17 మంది శాసనసభ్యుల మద్దతు కోల్పోతే కమల్నాథ్ ప్రభుత్వం పతనం ఖాయమవుతుంది. కాంగ్రెసు పార్టీ కర్ణాటకలో మాదిరిగానే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా అధికారాన్ని కోల్పోతోంది.