నిర్భయ కేసు: 'అతడి ఆచూకీ దొరకడం లేదు'

Juvenile convict in 2012 Nirbhaya gang-rape case untraceable: WCD Ministry
Highlights

నిర్భయ కేసులో మూడేళ్లపాటు శిక్షను అనుభవించిన మైనర్ నిందితుడి ఆచూకీ లభ్యం కావడం లేదని కేంద్ర మంత్రి మేనకాగాంధీ ప్రకటించారు. శిక్ష పూర్తైన తర్వాత అతడి ఆచూకీ లభ్యం కాలేదని ఆమె ప్రకటించారు. 

న్యూఢిల్లీ: నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో  అరెస్టై జైలు శిక్షను అనుభవించిన బాల నేరస్తుడు ఎక్కడున్నాడనే ప్రశ్న ప్రస్తుతం  చర్చనీయాంశంగా మారింది.  నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో  నిందితులకు ఉరిశిక్ష సరైందేనని  సుప్రీంకోర్టు సోమవారం నాడు  తీర్పు వెలువరించిన నేపథ్యంలో  ఈ చర్చ మరోసారి తెరమీదికి వచ్చింది.

ఈ కేసులో  అరెస్టయ్యే సమయానికి మైనర్ బాలుడిగా ఉన్న నిందితుడిని జువైనల్ హోమ్ కు తరలించారు. మూడేళ్ల పాటు శిక్ష ముగిసిన తర్వాత  అతను జువైనల్ హోం నుండి  బయటకు వచ్చినట్టుగా అధికారులు ప్రకటించారు.  అయితే  తాజాగా సుప్రీంకోర్టు  నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో తీర్పు వెలువరించిన నేపథ్యంలో  కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ  స్పందించారు.

ఆ మైనర్ బాలుడు ఎక్కడ ఉన్నాడనే విషయమై తమనకు సమాచారం తెలియడం లేదన్నారు. బాల నేరస్తుల శిక్షణాలయంలో మూడేళ్ల శిక్షను అతను అనుభవించాడని గుర్తు చేసిన ఆమె, ఆపై అతని జాడలు తెలియలేదని చెప్పారు. దేశవ్యాప్తంగా లైంగిక నేరాలకు పాల్పడినవారి డేటాబేస్ ను తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 

ఇదిలా ఉంటే ఆ బాల నేరస్తుడు 2016లో తన పేరును మార్చుకున్నాడని, ఢిల్లీకి దూరంగా వెళ్లిపోయి ఓ ఎన్జీవో సంస్థ సహకారంతో రహదారి పక్కనున్న చిన్న హోటల్ లో పనికి కుదిరాడని  ప్రచారం సాగుతోంది. 

కానీ, ఈ విషయమై స్పష్టత రావాల్సి ఉంది. ఈ కేసులో శిక్షను అనుభవించిన తర్వాత కొత్త జీవితంలోకి అడుగిడిన ఆ  బాలుడిని గుర్తిస్తే సమాజం మరోరకంగా ఇబ్బందులకు గురిచేసే అవకాశం కూడ లేకపోలేదు. దీంతో అతను పేరు మార్చుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారని  అభిప్రాయపడే వారు కూడ లేకపోలేదు.
 

loader