జస్టిస్‌ బోబ్డేతో కలిసి పనిచేసిన కాలాన్ని తాను ఎప్పటికీ మరిచిపోలేన్నారు సుప్రీంకోర్టు కొత్త చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. సీజేఐగా జస్టిస్‌ బోబ్డే పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో శుక్రవారం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు

జస్టిస్‌ బోబ్డేతో కలిసి పనిచేసిన కాలాన్ని తాను ఎప్పటికీ మరిచిపోలేన్నారు సుప్రీంకోర్టు కొత్త చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. సీజేఐగా జస్టిస్‌ బోబ్డే పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో శుక్రవారం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు.

కోవిడ్ నేపథ్యంలో వర్చువల్‌గా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎన్‌వీ రమణ మాట్లాడారు. వీడ్కోలు పలకడం అనేది చాలా కష్టమైన పని అంటూ జస్టిస్ రమణ ఉద్వేగానికి గురయ్యారు. జస్టిస్‌ బోబ్డే మేథస్సు, శక్తి సామర్థ్యాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆయన చెప్పారు.

బోబ్డేకు విభిన్న అభిరుచులు ఉన్నాయని, దీంతో పదవీ విరమణ తర్వాత ఏం చేయాలనే దానిపై ఆయన ఇప్పటికే నిర్ణయం తీసుకుని ఉంటారని జస్టిస్ రమణ అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లో ఆయన చేసే అన్ని ప్రయత్నాల్లో మంచి జరగాలని రమణ ఆకాంక్షించారు.

మారుతున్న కాలంతో పాటు, ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా ప్రజలకు న్యాయం అందించడం కోసం జస్టిస్‌ బోబ్డే ఈ-కోర్టులను ప్రారంభించారని, మహమ్మారి విజృంభిస్తున్నా మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేశారని జస్టిస్ రమణ కొనియాడారు.

Also Read:రేపు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ ప్రమాణం

దేశం ప్రస్తుతం పరీక్షా కాలాన్ని ఎదుర్కొంటోందని జస్టిస్‌ ఎన్వీ రమణ చెప్పారు. కరోనా తో పోరాడుతున్న ఇలాంటి క్లిష్ట సమయంలో కొన్ని బలమైన చర్యలు తీసుకొని వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని ఆయన సూచించారు.

విధిగా మాస్కులు ధరించాలని, చేతులు కడుక్కోవాలని సూచించారు. అవసరం ఉంటేనే బయటికి రావాలని జస్టిస్ రమణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. క్రమశిక్షణ, పట్టుదలతోనే కోవిడ్‌ను జయించగలమని ఆయన స్పష్టం చేశారు.

పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు కూడా కరోనా బారిన పడ్డారని జస్టిస్ రమణ గుర్తుచేసుకున్నారు. వైరస్‌కు పేద, ధనిక బేధభావాలూ లేవని అందరూ అప్రమత్తంగా ఉండాలని కొత్త సీజేఐ సూచించారు.