న్యూఢిల్లీ: తన బదిలీపై ఎట్టకేలకు జస్టిస్ మురళీధర్ మౌనం వీడారు. దేశ రాజధాని ఢిల్లీలో చెలరేగిన అల్లర్లపై విచారణ సందర్భంగా పోలీసుల తీరును ప్రశ్నిస్తూ, బిజెపి నేతలపై కేసులు పెట్టాలని ఆదేశించిన నేపథ్యంలో రాత్రికి రాత్రే బదిలీ చేశారనే ఆరోపణలు వచ్చాయి. అది వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో దానిపై ఆయన వివరణ ఇచ్చారు. 

బదిలీ విషయం తనకు ముందే తెలుసునని ఆయన చెప్పారు. పంజాబ్- హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ కావడంతో ఢిల్లీలో గురువారం హైకోర్టు న్యాయమూర్తులు, లాయర్లు ఆయనకు వీడ్కోలు చెప్పారు. ఈ కార్యక్రమంలో మురళీధర్ మాట్లాడారు. 

Also Read: ఢిల్లీ అల్లర్లపై విచారణ: హైకోర్టులో బిజెపి నేత కపిల్ మిశ్రా వీడియో ప్లే

సత్యం వైపు నిలబడాలని, అప్పుడు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు. తన బదిలీపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తనకు ముందుగానే సమాచారం ఇచ్చారని, ఏ విధమైన అభ్యంతరం లేదని తాను చెప్పడంతోనే బదిలీ చేశారని ఆయన చెప్పారు. ఫిబ్రవరి 26వ తేదీన తనకు బదిలీ ఉత్తర్వులు అందినట్లు ఆయన తెలిపారు.

ఢిల్లీలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన బిజెపి నాయకులు అనురాగ్ ఠకూర్, పర్వేష్ వర్మ, కపిల్ మిశ్రాలపై ఎఫ్ఐఆర్ ఎందుకు దాఖలు చేయలేదని విచారణ సందర్భంగా జస్టిస్ మురళీధర్ పోలీసులను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఆయన బదిలీ జరగడంతో వివాదం చోటు చేసుకుంది.

Also Read: రొటీన్: జస్టిస్ మురళీధర్ బదిలీపై రవిశంకర్ ప్రసాద్ వివరణ