అప్పుడు అభ్యంతరం, ఎట్టకేలకు సుప్రీం న్యాయమూర్తిగా జోసెఫ్

Justice KM Josephs Appointed as Supreme Court Justice
Highlights

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ నియామకానికి ఎట్టకేలకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. 

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ నియామకానికి ఎట్టకేలకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. జోసెఫ్‌తో పాటు మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ, ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వినీత్ శరణ్‌లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలంటూ సుప్రీం నేతృత్వంలోని కొలీజియం పంపిన సిఫారసులకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. 

కేంద్రం vs సుప్రీంకోర్టు వివాదం:
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల నియామకానికి సంబంధించి జనవరి 10న సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. అయితే మల్హోత్రా నియామకానికి ఆమోదముద్ర వేసిన కేంద్రం.. జోసెఫ్ విషయంలో మాత్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. జస్టిస్ జోసెఫ్‌కు సీనియార్టీ లేదని, ఆయన పదోన్నతి అంశాన్ని మరోసారి పరిశీలించాలని కొలీజియంకు తిప్పి పంపింది. 

మోడీ, అమిత్ షాలే అడ్డుకున్నారా..?
ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న కెఎం.జోసెఫ్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి సుప్రీం కొలీజియం సిఫారసు చేసినా.. ఆ ఫైలును మోడీ ప్రభుత్వం వెనక్కి పంపడం రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా సుప్రీం కొలీజియం ప్రతిపాదనలను పున:పరిశీలించాల్సిందిగా తిప్పి పంపడం రాజ్యాంగ ప్రతిష్టంభన దిశగా నడిపించింది.

కేంద్రం వ్యవహార శైలిపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరాన్ని తెలిపింది. తమ వ్యవహారాల్లో తల దూర్చడం రాజ్యాంగ విరుద్ధమని అత్యున్నత న్యాయస్థానం కేంద్రంపై మండిపడింది. 2016లో ఉత్తరాఖండ్‌లోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రద్దు చేసి కేంద్రం అక్కడ రాష్ట్రపతి పాలన విధించింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును చీఫ్ జస్టిస్ హోదాలో జోసెఫ్ విచారించారు. ఇరు పక్షాల వాదనలను విన్న జోసెఫ్...రాష్ట్రపతి పాలనను రద్దు చేసి... తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టారు.

రాజకీయంగా తమకు చావు దెబ్బ లాంటి తీర్పును వెలువరించిన జోసెఫ్‌పై బీజేపీ ప్రతీకార రాజకీయాలకు దిగుతోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. జోసెఫ్ నియామకానికి సంబంధించి కొలీజియం పలు విడతలుగా భేటీ అయ్యింది. మరోసారి జస్టిస్ జోసెఫ్‌ పేరును సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రతిపాదిస్తూ కేంద్రానికి సిఫారసు చేసింది.

కొలీజియం అదే ప్రతిపాదనను మళ్లీ పంపితే.. కేంద్రం కచ్చితంగా దానిని ఆమోదించాలని నిబంధనలు చెబుతున్నాయి. దీనిలో భాగంగా తప్పనిసరి పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వం జోసెఫ్ నియమాకానికి ఆమోదముద్ర వేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ రాజకీయ వ్యవస్థపై న్యాయవ్యవస్థ అంతిమంగా పైచేయి సాధించిందని విశ్లేషకులు అంటున్నారు.

loader