తమిళనాడులో సంచలనం రేపిన విద్యార్థిని మృతి కేసులో ఆమె తండ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అయితే అతని పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసి పుచ్చింది.
న్యూఢిల్లీ : తమిళనాడులో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కళ్లకుర్చి జిల్లా చిన్న సేలం ప్లస్-2 విద్యార్థిని శ్రీమతి అనుమానాస్పద మృతిపై సుప్రీంకోర్టు బాధితురాలి తండ్రికి కీలక సూచనలు చేసింది. తన కూతురి మృతికి సంబంధించి వెల్లడించిన పోస్టుమార్టం నివేదికపై అనుమానాలు ఉన్నాయని, ఫోరెన్సిక్ నిపుణుడి సమక్షంలో మరోసారి పోస్టుమార్టం నిర్వహించాలని బాధితుడి తండ్రి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బాధితురాలి తండ్రికి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది.
ఇదిలా ఉండగా బాధిత విద్యార్థిని శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయని, అవి ఆమె మృతి చెందడానికి ముందే ఆ గాయాలు ఏర్పడ్డాయని, ముక్కు, కుడి భుజం, కడుపుపై భాగాన గాయాలు, దుస్తులలో రక్తపు మరకలు ఉన్నాయని.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. అధిక రక్తస్రావం, దిగ్భ్రాంతి కారణంగా విద్యార్థిని మృతి చెందినట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే…
కడలూరు జిల్లా పెనమలూరు గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక చిన్నసేలం సమీపంలోని ప్రైవేటు పాఠశాలలో హాస్టల్లో ఉంటూ ప్లస్ -టూ చదువుతోంది. జూలై 14న హాస్టల్ బిల్డింగ్ మూడో అంతస్తు పై నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు, కుటుంబీకులు హుటాహుటిన కాలేజీకి చేరుకున్నారు. ఆ సమయంలోనే పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థిని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు పంపించారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. విద్యార్థిని అనుమానాస్పద మృతిపై న్యాయ విచారణ జరపాలని కోరుతూ చిన్న సేలం వద్దనున్న ప్రైవేట్ కాలేజీ ఎదుట రహదారిపై విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
Justice for Srimathi : తమిళనాడు బాలిక అనుమానాస్పద మృతి కేసులో ఇద్దరు టీచర్లు అరెస్ట్..
ఆ సమయంలో ఆందోళనకారులు హఠాత్తుగా పోలీసుల పైకి రాళ్లు రువ్వి, దాడికి దిగారు. వ్యాన్ లో నుంచి దిగిన పోలీసులపై రాళ్ల వర్షం కురిపించడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులు పోలీస్ వ్యాన్ కు నిప్పంటించి కళాశాల ప్రవేశ ద్వారం పగులగొట్టి లోపలికి వెళ్లి కాలేజీ బస్సులను అక్కడే నిలిపి ఉంచడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. అదే సమయంలో కొందరు ఆందోళనకారులు ట్రాక్టర్తో ఢీ కొట్టించి కాలేజీ బస్సులను పూర్తిగా ధ్వంసం చేశారు.
కాలేజీ గదుల్లోనే వస్తువులన్నింటిని ధ్వంసం చేశారు. పెట్రోలు పోసి నిప్పంటించారు. కాలేజీ ఎదుట పోలీసులు అడ్డంగా పెట్టిన ఇనుప బారికేడ్లను కూడా ఆందోళనకారులు తొలగించి వాటిని కూడా ధ్వంసం చేశారు. చివరికి పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు తుపాకులతో గాలిలోకి కాల్పులు జరిపారు. ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు. అదనపు బలగాలను మోహరించిన పరిస్థితి అదుపులోకి రాలేదు.
ఈ నేపథ్యంలో ఆందోళనకారులు హింసను విడనాడకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని డీఐజీ పాండ్యన్ హెచ్చరించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కల్లకురిచి తాలూకాలో 144వ నిషేధాజ్ఞలు విధించారు. కల్లకురిచిలో విద్యార్థి మృతిపై జరుగుతున్న ఆందోళన విరమించుకోవాలని ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన తమిళనాడులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
