న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల విషయంలో  అంతర్గత విచారణ కోసం  ముగ్గురు జడ్జిలతో కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో జస్టిస్ ఎన్వీ రమణ కూడ సభ్యుడిగా ఉన్నారు.అయితే ఈ కమిటీలో ఎన్వీ రమణ ఉండడంపై విమర్శలు రావడంతో ఆయన తప్పుకొన్నారు.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ గొగోయ్‌‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో  పనిచేసిన మాజీ ఉద్యోగిని లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది.ఈ మేరకు కోర్టుకు లేఖను సమర్పించింది.

 సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణ చీఫ్ జస్టిస్‌కు అత్యంత సన్నిహితుడని బాధితురాలు ఆ లేఖలో ఆరోపించింది. అతడిని ప్యానెల్ కమిటీ నుండి తొలగించాలని కోరింది. అంతేకాదు ప్యానెల్‌లో మహిళా జడ్జిలను నియమించాలని కూడ కోరింది.

ఈ నెల 23వ తేదీన ప్యానెల్ ఏర్పాటైంది.చీఫ్ జస్టిస్ మినహా సుప్రీంకోర్టు జడ్జిలంతా  ఈ సమావేశానికి హాజరై ఈ ప్యానెల్ జడ్జిల కమిటీని ఏర్పాటు చేశారు.

జస్టిస్ ఎస్ఏ బాబ్డే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తర్వాత బాబ్డే సీనియర్ జడ్జి. బాబ్డే ఈ ప్యానెల్‌కు నేతృత్వం వహిస్తున్నాడు. తానే ఈ ప్యానెల్‌లో ఉండే జడ్జిలను ఎంపిక చేశారు. ఈ ప్యానెల్‌లో మరో జడ్జిగా  ఇందిరా బెనర్జీని తీసుకొన్నారు.

తన తర్వాత సీనియర్ జడ్జి ఎన్వీ రమణ... అందుకే ఆయనను ప్యానెల్‌లో తీసుకొన్నట్టుగా జడ్జి బాబ్డే ప్రకటించారు. ప్యానెల్‌లో మహిళా జడ్జి కోసం ఇందిర బెనర్జీని ఎంపిక చేసినట్టుగా ఆయన వివరించారు. అయితే మాజీ సుప్రీంకోర్టు ఉద్యోగిని బుధవారం నాడు రాత్రి కోర్టుకు సమర్పించిన లేఖలో ఎన్వీ రమణ గురించి ప్రస్తావించడంతో  ఆయన  ఈ కమిటీ నుండి తప్పుకొన్నారు. ఈ నిర్ణయాన్ని బాధితురాలి తరపు న్యాయవాది ఇందిరా జైసింగ్  ప్రశంసించారు.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది మాజీ ఉద్యోగిని. ఈ మేరకు ఆమె అఫిడవిట్‌ను  సమర్పించింది.ఈ ఆరోపణలను చీఫ్ జస్టిస్ గొగోయ్ తీవ్రంగా ఖండించారు. కుట్రపూరితంగానే తనపై ఈ వ్యాఖ్యలను చేశారని ఆరోపించారు.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్  రంజన్ గొగోయ్‌పై న్యాయవాది ఉత్సవ్ బెయిన్స్ దాఖలు గురువారం నాడు సమర్పించిన అఫిడవిట్‌ కుట్ర పూరితమైందనే  అభిప్రాయంతో  సుప్రీంకోర్టు ధర్మాసనం ఉంది. ఈ విషయమై రిటైర్డ్  జడ్జి ఎకె పాట్నాక్ నేతృత్వంలో విచారణను కొనసాగించాలని  గురువారం నాడు ఆదేశించింది.

సంబంధిత వార్తలు

సుప్రీం చీఫ్ జస్టిస్‌పై లైంగిక వేధింపుల కేసు: సీల్డ్ కవర్లో అఫిడవిట్