అదానీ వ్యవహారంపై జేపీసీ ఏర్పాటు చేయాల్సిందే.. పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
Budget session: అదానీ-హిడెన్ బర్గ్ వ్యవహారంలో జేపీసీ విచారణకు డిమాండ్ చేస్తూ విపక్షాల ఆందోళనల మధ్య లోక్ సభ స్పీకర్ నేటి సమావేశాలను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. బడ్జెట్ 2023 మొదటి భాగం మాదిరిగానే ద్వితీయార్ధం కూడా అంతరాయాలతో ముందుకుసాగుతోంది.

Parliament Budget Session 2023: ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం నెలకొనడంతో ఒక రోజు వాయిదా పడిన రాజ్యసభ, లోక్ సభలు తిరిగి ప్రారంభం అయ్యాయి. అయితే, మరోసారి గౌతమ్ అదానీ-హిడెన్ బర్గ్ వ్యవహారంపై జేపీసీ (జాయింట్ పార్లమెంటరీ కమిటీ) విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా, గత వారం లండన్ లో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని అధికార పార్టీ డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే మరోసారి లోక్ సభ సమావేశాలు మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదాపడ్డాయి.
అదానీ-హిడెన్ బర్గ్ వ్యవహారంలో జేపీసీ విచారణకు డిమాండ్ చేస్తూ విపక్షాల ఆందోళనల మధ్య లోక్ సభ స్పీకర్ నేటి సమావేశాలను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. బడ్జెట్ 2023 మొదటి భాగం మాదిరిగానే ద్వితీయార్ధం కూడా అంతరాయాలతో ముందుకుసాగుతోంది. మళ్లీ మంగళవారం నాటి సమావేశాల్లోనూ ఇరువైపులా గణనీయమైన నిరసనలు చోటుచేసుకోవడంతో.. మరోసారి సామావేశాలు వాయిదాపడ్డాయి. నేటి సమావేశాలు ప్రారంభమైన తర్వాత తమ డిమాండ్లను కొనసాగిస్తూ, ప్రతిపక్ష నాయకులు అదానీ వ్యవహారంపై 'వి వాంట్ జేపీసీ' నినాదాలు చేస్తూ, విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్ చేశారు.
రాజ్యసభలో అదానీ-హిడెన్‌బర్గ్ సమస్యపై చర్చను రాజ్యసభ ఛైర్మన్ తిరస్కరించారు. అంతకుముందు, పార్లమెంట్‌లోని మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో సారూప్య భావాలు కలిగిన ప్రతిపక్ష పార్టీల నాయకులు సమావేశమై సభాలో తమ గొంతుకలను వినిపించేందుకు వ్యూహాలు రూపొందించారు.
రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పరు: మల్లికార్జున ఖర్గే
లండన్ లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది. అయితే, రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పరని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. "మాకు సమాధానం లభించే వరకు అదే డిమాండ్ ను పదేపదే అడుగుతాం. ఇది సమస్య నుంచి పక్కదారి పట్టడం మాత్రమే. మన రాయబార కార్యాలయాలపై దాడులు జరుగుతున్నా ఈ దాడులను ఖండిస్తూ ఏమీ మాట్లాడటం లేదు. వీరు మెహుల్ చోక్సీకి రక్షణ కల్పించారని, ఇప్పుడు దేశభక్తి గురించి మాట్లాడుతున్నారని" మండిపడ్డారు.