న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని జేఎన్‌యూ విద్యార్ధి సంఘం అధ్యక్షురాలితో పాటు పలువురు విద్యార్థులు, ప్రోఫెసర్లపై జరిగిన దాడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఈ దాడిని నిరసిస్తూ జేఎన్‌యూ విద్యార్థులు ఆందోళనలు నిర్వహించారు. ఈ దాడిపై వామపక్ష విద్యార్ధి సంఘాలు, ఏబీవీపీ విద్యార్ధి సంఘాలు పరస్పరం ఆరోపణలు చేసుకొన్నాయి.  ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

జేఎన్‌యూలో సీసీటీవీ పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.  జేఎన్‌యూ విద్యార్థులకు దేశ వ్యాప్తంగా పలు యూనివర్శిటీల విద్యార్థులు సంఘీభావం తెలిపారు. ఈ మేరకు ప్రదర్శనలు నిర్వహించారు. 

ఏబీవీపీ శక్తులు ఈ దాడి వెనుక ఉన్నట్టుగా జేఎన్‌యూ ఎస్‌యూ విద్యార్థి సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. జేఎన్‌యూ విద్యార్థులపై ముసుగు వ్యక్తుల దాడి విషయమై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌‌తో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఫోన్‌లో మాట్లాడారు. 

ఈ ఘటనపై ఢిల్లీలోని జేఎన్‌యూ వైస్ ఛాన్సిలర్ జగదీష్‌కుమార్ స్పందించారు. యూనివర్శిటీలోని విద్యార్థులంతా శాంతి కోసం ప్రయత్నించాలని ఆయన కోరారు. విద్యార్థులకు రక్షణ కల్పిస్తామని వీసీ ప్రకటించారు. తాము అన్ని రకాల ప్రయత్నాలను చేస్తున్నామని చెప్పారు.శీతాకాల సెమిస్టర్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని వీసీ జగదీష్ స్పష్టం చేశారు.

Also read:బ్రేకింగ్: జేఎన్‌యూ ప్రెసిడెంట్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

గూండాల దాడిలో గాయపడిన జేఎన్‌యూ విద్యార్ది సంఘం అధ్యక్షురాలు ఆయూషీ ఘోష్ ఎయిమ్స్ నుండి సోమవారం నాడు డిశ్చార్జి అయింది.ఆదివారం నాడు రాత్రి గూండాల దాడిలో గాయపడిన మరో 28 మంది విద్యార్థులు కూడ ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయ్యారు.

ఈ ఘటనను లెప్టినెంట్ గవర్నర్ సీరియస్ అయ్యారు. జేఎన్‌యూలో విద్యార్థులపై  దాడి ఘటనపై మానవ వనరుల శాఖకు జేఎన్‌యూ  వీసీ నివేదికను పంపారు. మరోవైపు జేఎన్‌యూ రిజిస్ట్రార్, వీసీలు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిశారు. ఆదివారం నాడు రాత్రి యూనివర్శిటీలో జరిగిన దాడి గురించి లెప్టినెంట్ గవర్నర్‌కు వివరించారు.