హైదరాబాద్: గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని యూనివర్సిటీల్లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా, ఎన్నార్సికి వ్యతిరేకంగా అనేక నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జే ఎన్ యు యూనివర్సిటీలో ఆదివారం దుండగులు ప్రవేశించి అక్కడి విద్యార్థులను తీవ్రంగా గాయపరచడం చాలా దురదృష్టకరం. 

ఈ సంఘటన వల్ల ఒక్కసారిగా ఉద్రిక్తతలు భారీ స్థాయిలో పెరిగాయి.  జే ఎన్ యు ఉపకులపతి రాజీనామా చేయాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. మొన్న నవంబర్ లో ఫీజులు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ మొదలైన ఈ రాజీనామా డిమాండ్ ఇప్పుడు ప్రబలంగా ఊపందుకుంది. 

ఇదొక్కటే కాకుండా గతంలో జరిగిన  జే ఎన్ యు ఎన్నికలను యూనివర్సిటీ నిర్వహించని కారణంగా, ఆ ఎన్నికల్లో గెలిచిన సంఘాన్ని అధికారికంగా గుర్తించడం కుదరదు అంటూ కూడా వైస్ ఛాన్సలర్ తీసుకున్న నిర్ణయం అప్పట్లో కూడా వివాదాస్పదమైంది. 

Also read: 26/11 గుర్తుకొచ్చేలా చేసింది : జేఎన్‌యూ ఘటనను ఖండించిన ఉద్ధవ్ థాక్రే

ఈ విషయాలన్నింటిని అటుపక్కకుంచితే...ఆ వివాదాల పుట్టలో చిక్కుకున్న ఉపకులపతి జగదీశ్ కుమార్ తెలుగువాడిని, నల్గొండ జిల్లా వాడని మనలో ఎంతమందికి తెలుసు? ఈ నేపథ్యంలో ఈ  జే ఎన్ యు ఉపకులపతికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకోసం. 

జగదీశ్ కుమార్ పూర్తి పేరు మామిడాల జగదీశ్ కుమార్. ఈయన పుట్టింది ఉమ్మడి నల్గొండ జిల్లా, ప్రస్తుత సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి మండలంలోని మామిడాల గ్రామం. జయప్రద దేవి, రంగారావు దంపతులకు ఈయన జన్మించాడు. ఈయన తండ్రి ప్రాథమిక పాఠశాల లో టీచర్ గా పనిచేసేవారు. ఈ మనకు సునీత, గీత అనే ఇద్దరు సోదరీమణులు కూడా ఉన్నారు. సునీత నల్గొండలో నివాసముంటుండగా, మరో సోదరి గీత హైదరాబాద్ లో నివాసముంటున్నారు. 

ఐఐటీ మద్రాస్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో మాస్టర్స్, పీహెచ్ డీ ని పూర్తిచేసాడు. పోస్ట్ డాక్టోరల్ విద్యను అభ్యసించడానికి కెనడాలోని వాటర్లూ యూనివర్సిటీలో చేరాడు. ఆ తరువాత ఐఐటీ ఢిల్లీలో అధ్యాపకుడిగా కొనసాగుతున్నాడు. 

Also read: జెఎన్ యులో దీపిక పడుకొనే: దాడికి గురైన విద్యార్థులకు మద్దతు

ఇంజనీరింగ్ విభాగంలో అనేక సేవలందించిన ఈయన అనేక నూతన ఆవిష్కరణలకు ఉపయుక్తమైన ఎన్నో నూతన పదార్థాలను డెవలప్ చేసారు. సెమి కండక్టర్లను అభివృద్ధి చేయడంలో ఈయనది అందే వేసిన చేయి. ఇంజనీరింగ్ కి సంబంధించిన చాలా పుస్తకాలను సైతం రచించాడు. 

జే ఎన్ యు ఉపకులపతి గా ఈయన నియామకం అప్పట్లో ఒక పెద్ద దుమారానికి తెరలేపింది. 

ఐఐటీ,  జే ఎన్ యు లు ఒకే విధంగా పనిచేయవని, వాటి పరిపాలన వేరుగా ఉంటుందని రాష్ట్రపతికి పంపిన నివేదికలో పేర్కొన్నారు. అప్పట్లో స్మ్రితి ఇరానీ సైతం జగదీశ్ కుమార్ ని కాదు అని, పద్మశ్రీ చౌహన్ ని ఎంపిక చేయమని పేర్కొన్నారు. ఈయనకు ఆరెస్సెస్ తో ఉన్న సన్నిహిత సంబంధాల వల్లనే ఈయనకు 2016 లో  జే ఎన్ యు వైస్ ఛాన్సలర్ పదవి దక్కిందని అప్పట్లో తీవ్ర దుమారం చెలరేగింది.