జార్ఖండ్‌లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఎదురుదెబ్బ తప్పదని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. శుక్రవారం అక్కడ చివరి విడత ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం జాతీయ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి.

జార్ఖండ్‌లో కాంగ్రెస్-జేఎంఎం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సర్వేల్లో తేలింది. కాంగ్రెస్ - జేఎంఎం కూటమి 38-50 సీట్లను సొంతం చేసుకుని అధికారాన్ని అందుకుంటుందని.. అదే సమయంలో బీజేపీ 22-32 స్థానాలకే పరిమితం అవుతుందని కొన్ని సంస్థలు తెలిపాయి.

Also Read:2008 జైపూర్ పేలుళ్ల కేసు: నలుగురికి మరణశిక్ష విధించిన ప్రత్యేక కోర్టు

వీటికి భిన్నంగా హంగ్ వచ్చే అవకాశం సైతం లేకపోలేదని మరికొన్ని మీడియా సంస్థలు అంచనా వేశాయి. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 42 మంది సభ్యుల మద్ధతు అవసరం. శుక్రవారం జరిగిన చివరి దశ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది.

రాష్ట్రంలోని 16 స్థానాలకు జరిగిన పోలింగ్‌లో సాయంత్రం 5 గంటల వరకు 70.83 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం అగ్రనేత హేమంత్ సోరెన్‌తో పాటు ఇద్దరు మంత్రులు చివరి దశ పోలింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

Also Read:ఉన్నావ్ రేప్‌ కేసు:బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌కు జీవిత ఖైదు

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సైతం జోరుగా ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. 

ఇండియా టుడే సర్వే:

బీజేపీ: 22-32
కాంగ్రెస్- జేఎంఎం: 38-50
ఏజేఎస్‌యూ: 3-5
ఇతరులు: 6-11

ఏబీపీ-సీ ఓటర్ సర్వే:

బీజేపీ: 32
కాంగ్రెస్-జేఎంఎం: 35
ఏజేఎస్‌యూ: 05
ఇతరులు: 09

టైమ్స్ నౌ సర్వే:

బీజేపీ: 28
కాంగ్రెస్-జేఎంఎం: 44
జేవీఎం: 03
ఇతరులు: 06