ఈడీ సమన్లు, దాడుల్లో చిక్కుకున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ బీజేపీ పై పొలిటికల్ వార్‌కు సిద్ధం అవుతున్నారు. ఆయన స్థానికులను నిర్ణయించే బిల్లు, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లను పంచే నిర్ణయాలను ముందుకు తీసుకురాబోతున్నారు. త్వరలోనే ఈ బిల్లులను అసెంబ్లీలో ఆమోదించుకోబోతున్నారు. 

రాంచీ: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సహా పలువురిపై కేంద్ర దర్యాప్తు ఏజెన్సీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు పంపుతున్నది. తనిఖీలు చేస్తున్నది. రాష్ట్రంలోని బీజేపీ వీటిని చూపిస్తూ బలపడే ప్రయత్నం చేస్తుండగా.. ప్రభుత్వం నిస్సహాయంగా నిలిచిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.ఈ తరుణంలో హేమంత్ సోరెన్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నది. బీజేపీపై పొలిటికల్ ఫైటింగ్‌కు తెరలేపినట్టు తెలుస్తున్నది. ఇందులో భాగంగా రాజకీయపరంగా సున్నితమైన నిర్ణయాలను ముందుకు తెచ్చింది. భూ రికార్డులను పరిశీలించడానికి 1932 సంవత్సరాన్ని ఆధారంగా తీసుకునే నిర్ణయాన్ని అమలు చేయడానికి సన్నద్ధమవుతున్నది. అలాగే, రిజర్వేషన్లు పెంచే నిర్ణయాన్ని కూడా ముందుకు తెచ్చింది.

శుక్రవారం నిర్వహించే అసెంబ్లీ ప్రత్యేక సెషన్‌లో ఈ రెండు బిల్లులకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉన్నది. అయితే, రాజకీయంగా ఎంతో సున్నితమైన ఈ విషయాలను రాష్ట్రంలోని ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపే అవకాశాలు కూడా చాలా స్వల్పం.

ఒక్కసారి గవర్నర్ ఈ కోటాకు ఆమోదం తెలిపితే ఆ తర్వాత వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని ఇప్పటికే స్పష్టం చేసింది. 

Also Read: నేనే దోషి అయితే ఎందుకు ప్రశ్నించడం?.. వీలైతే వచ్చి అరెస్టు చేయండి: ఈడీ నోటీసులపై హేమంత్ సోరెన్‌ ఫైర్

స్థానికులు ఎవరనేది తేల్చే బిల్లులో కీలక మార్పులను తీసుకురాబోతున్నది. స్థానికులను నిర్ధారించడానికి 1932ను బేస్ ఇయర్‌గా నిర్ణయించనుంది. 1932కు ముందు జార్ఖండ్‌లో నివసించిన, 1932లో బ్రిటీష్ వారు నిర్వహించిన సర్వేలో పేర్లు ఉన్నవారే స్థానికులుగా నిర్ణయించబడతారు. భూమి లేని వారిపై గ్రామసభల్లో నిర్ణయం జరుగుతుంది.

కాగా, విద్య, ఉద్యోగాల్లోనూ ఓబీసీ, ఎస్టీ, ఎస్సీల రిజర్వేషన్లు పెంచబోతున్నది. ఓబీసీల రిజర్వేషన్లను 14 శాతం నుంచి 27 శాతానికి పెంచనుంది. ఎస్టీల కోటాను 26 శాతం నుంచి 28 శాతానికి పెంచబోతున్నది. అలాగే, ఎస్సీల రిజర్వేషన్లు 10 శాతం నుంచి 12 శాతానికి పెంచనుంది. ఈడబ్ల్యూఎస్‌కు పది శాతం రిజర్వేషన్లు కూడా కలిపితే మొత్తంగా రాష్ట్రంలో రిజర్వేషన్లు 77 శాతానికి పెరుగుతాయి. దేశంలోనే అత్యధిక రిజర్వేషన్లు ఉన్న రాష్ట్రంగా జార్ఖండ్ నిలబడనుంది. రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం స్థానికులను నిర్ణయించడానికి 1985ను బేస్ ఇయర్‌గా తీసుకోవాలని అభిప్రాయపడింది.