జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో.. “నేనే దోషి అయితే నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు?.. మీకు వీలైతే వచ్చి నన్ను అరెస్టు చేయండి” అంటూ కామెంట్ చేశారు.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో.. “నేనే దోషి అయితే నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు?.. మీకు వీలైతే వచ్చి నన్ను అరెస్టు చేయండి” అంటూ కామెంట్ చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ తనకు సమన్లు పంపడం ఒక గిరిజన ముఖ్యమంత్రిని వేధించే కుట్రలో భాగం అని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. హేమంత్ సోరెన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. జార్ఖండ్‌లో అక్రమ మైనింగ్‌తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో నవంబర్ 3వ తేదీన హేమంత్ సోరెన్‌ను విచారణకు పిలిచినట్టుగా ఈడీ అధికారులు చెప్పారు. అయితే హేమంత్ సోరెన్ ఈడీ విచారణకు హాజరుకాలేదు.
ఈ క్రంలోనే హేమంత్ సోరెన్ తన నివాసానికి సమీపంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తనకు ఈడీ సమన్లు జారీ చేయడంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేశారు. “నేను భయపడను.. చింతించను. దానికి బదులు నేను బలంగా ఎదుగుతున్నాను. జార్ఖండ్ ప్రజలు భావిస్తే.. ప్రత్యర్థులకు దాక్కోవడానికి చోటు దొరకదు’’ అని అన్నారు. ‘‘అధికార బీజేపీని వ్యతిరేకించే ఎవరి గొంతునైనా అణచివేయడానికి ఇది రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేయడమే’’అని ఆరోపించారు. ఈడీ కార్యాలయం దగ్గర భద్రతను పెంచారు.. జార్ఖండ్ వాసులంటే మీకెందుకు భయం? అని ప్రశ్నించారు.
ఇక, నవంబర్ 3వ తేదీన రాంచీలోని ప్రాంతీయ కార్యాలయంలో తమ ముంద విచారణకు హాజరుకావాలని హేమంత్ సోరెన్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద హేమంత్ సోరెన్‌ను ప్రశ్నించి.. ఆయన స్టేట్‌మెంట్‌ను నమోదు చేయాలని ఈడీ భావిస్తున్నట్టుగా అధికారులు చెప్పారు.
ఈ కేసులో హేమంత్ సోరెన్ సన్నిహితుడు పంకజ్ మిశ్రాతో పాటు మరో ఇద్దరిని ఈడీ గతంలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ. 1,000 కోట్లకు పైగా అక్రమ మైనింగ్‌కు సంబంధించిన నేరాల ఆదాయాన్ని గుర్తించినట్లు ఈడీ తెలిపింది. జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్, బర్హైత్, రాజ్‌మహల్, మీర్జా చౌకీ, బర్హర్వాలోని 19 ప్రాంతాల్లో అక్రమ మైనింగ్, దోపిడీకి సంబంధించిన కేసులతో సంబంధం ఉన్న కేసులో జూలై 8న పంకజ్ మిశ్రా, అతని సహచరులపై ఈడీ దాడి చేసింది. ఆ తర్వాత ఈ కేసులో ఈడీ దర్యాప్తును ప్రారంభించింది.
