మణిపూర్ లో కొలువుదీరనున్న బీజేపీ ప్రభుత్వానికి జేడీ(యూ), ఎన్ పీఎఫ్ మద్దతు ఇవ్వనున్నాయి. ఈ మేరకు ఆ రెండు పార్టీలు ఒక ప్రకటన విడుదల చేశాయి. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా మద్దతు ఇస్తామని ప్రకటించారు.

మణిపూర్‌ (manipur)లో బీజేపీ (bjp)ప్ర‌భుత్వం ఏర్పాటు కానుంది. అయితే రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేందుకు దాని జాతీయ మిత్రపక్షం అయిన‌ జనతాదళ్ (యునైటెడ్), ప్రాంతీయ మిత్రపక్షమైన నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) మ‌ద్ద‌తు ఇస్తామ‌ని శ‌నివారం ప్ర‌క‌టించాయి. వీటితో పాటు ఇద్ద‌రు స్వ‌తంత్ర అభ్య‌ర్థులు కూడా మ‌ద్ద‌తు తెలిపారు. 

ఇటీవల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నికలలో 38 మంది అభ్యర్థులను నిలబెట్టిన JD (U) ఆరు స్థానాలను గెలుచుకుంది. అలాగే NPF 10 మంది అభ్య‌ర్థుల‌ను పోటీలో దించి ఐదు స్థానాలను గెలుచుకుంది. మణిపూర్ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీకి మద్దతు ఇవ్వాలని జేడీ(యూ) నిర్ణయించినట్లు ఆ పార్టీ జాతీయ కార్యాలయ కార్యదర్శి మహ్మద్ నిసార్ (Mohammad Nisar) ఒక ప్రకటనలో తెలిపారు. జేడీ (యూ) అధిష్టానం నిర్ణ‌యాన్ని గౌర‌వించాల‌ని, మణిపూర్ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చాలని బీజేపీకి విజ్ఞప్తి చేశారు. ఈశాన్య ప్రాంత ఇంచార్జి జాతీయ ప్రధాన కార్యదర్శి అఫాక్ అహ్మద్ ఖాన్ సమక్షంలో జేడీ (యూ) లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఖుముక్చమ్ జోయ్‌కిసన్ సింగ్‌ (Khumukcham Joykisan singh)ను పార్టీ శాసనసభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని పేర్కొంది.

ఎన్‌పీఎఫ్ సెక్రటరీ జనరల్ అచుంబెమో కికాన్ (Achumbemo Kikon)మాట్లాడుతూ.. 2017 నుంచి బీజేపీతో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ పార్టీ ఏర్పాటు చేయ‌బోయే ప్ర‌భుత్వానికి త‌మ పార్టీ మద్దతు ఇస్తుందని అన్నారు. కొత్త మంత్రివర్గంలో కొన్ని క్యాబినెట్ బెర్త్‌లను పార్టీ కోరే అవకాశం ఉందని ఎన్‌పీఎఫ్ వర్గాలు తెలిపాయి. మణిపూర్ తదుపరి ముఖ్యమంత్రిని బీజేపీ పార్లమెంటరీ బోర్డుతో పాటు రాష్ట్ర విభాగం కూడా నిర్ణయిస్తుందని రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు శారదా దేవి (Sharda Devi) గురువారం తెలిపారు. తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ పార్టీని ఆహ్వానించగానే పార్టీ సిద్ధంగా ఉంటుందని ఆమె తెలిపారు.

60 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 32 స్థానాలతో మెజారిటీ మార్కు సీట్లను సాధించింది. రాష్ట్రంలో 31 స్థానాలు గెలుపొందిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. దీంతో సునాయాసంగా ఆ పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌గ‌లిగినా.. మిత్ర ప‌క్షాల మ‌ద్ద‌తు తీసుకుంటోంది. కాగా 2017లో మ‌ణిపూర్ లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసుకోవ‌డంలో విఫ‌లం అయ్యింది. ఆ ఎన్నిక‌ల స‌మ‌యంలో 27 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంద‌గా.. ప్ర‌స్తుతం ఆ పార్టీకి 13 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే మిగిలారు. వారంతా అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీ బ‌ల‌హీన ప‌డింది. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు ఉన్న ప‌రిస్థితే మ‌ణిపూర్ లోనూ ఉంది. బ‌ల‌మైన కాంగ్రెస్ నాయ‌కులు లేకుండానే ఈ ఎన్నిక‌ల్లో రంగంలోకి దిగింది. అయితే కాంగ్రెస్ కు బల‌మైన నాయ‌కుడు అయిన ఓక్రమ్ ఇబోబి సింగ్ గత రెండు నెలల్లో ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. అయితే గ‌త ఐదేళ్ల‌లో ఆయ‌న ప్ర‌తిప‌క్షహోదాలో గ‌ట్టిగా పోరాడ‌లేదు. అందుకే ఈ సారి కూడా ఆ పార్టీ ప్ర‌తిప‌క్ష పార్టీగానే మిగిలిపోయింది.