జేడీఎస్ అగ్రనేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కోలుకున్నఅనంతరం ఆయన మాట్లాడుతూ..  ఇది తనకు మూడో జన్మ అని వ్యాఖ్యానించారు. 

జేడీఎస్ అగ్రనేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. సకాలంలో చికిత్స అందించడంతో పక్షవాతం నుంచి కోలుకున్నారు కుమారస్వామి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఇది తనకు మూడో జన్మ అని వ్యాఖ్యానించారు. భగవంతుడికి, తనకు చికిత్స అందించని వైద్యుల బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రజల మధ్య వుండేందుకు తాను కొత్త జీవితాన్ని పొందానని జేడీఎస్ నేత వ్యాఖ్యానించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే ముందు.. పక్షవాతం లక్షణాలను తేలికగా తీసుకోవద్దని కుమారస్వామి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

గత ఐదు రోజలుగా తన స్నేహితులు కొందరు భయంతో వున్నారని.. తాను మీతో మాట్లాడుతుంటే , తనకు పునర్జన్మ వచ్చిందనే చెప్పాలని కుమారస్వామి పేర్కొన్నారు. తన ఆరోగ్యానికి సంబంధించి దేవుడు తనకు మూడో జన్మనిచ్చాడని.. ఒక వ్యక్తికి ఒక జన్మ వస్తే, తన 64 ఏళ్ల వయసులో తనకు మూడో జన్మ వచ్చిందని కుమారస్వామి వ్యాఖ్యానించారు. 

కుమారస్వామి ఆగస్ట్ 30 తెల్లవారుజామున బెంగళూరులోని ప్రముఖ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు పక్షవాతం వచ్చిందని, ఆ తర్వాత పూర్తిగా నయమైందని చికిత్స అందిస్తున్న డాక్టర్లు తెలిపారు. తాను ఆసుపత్రిలో చేరడానికి దారి తీసిన పరిస్ధితులను కుమారస్వామి గుర్తుచేసుకున్నారు. ఆగస్ట్ 30న తెల్లవారుజామున 2 గంటలకు నిద్రలేచే సమయానికి తన ఆరోగ్యం బాగోలేదని చెప్పారు. వెంటనే తన బావ, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సీఎన్ మంజునాథ్‌ని పిలిపించినట్లు చెప్పాడు. తనను పరీక్షించిన అనంతరం హుటాహుటిన న్యూరాలజిస్ట్‌ వద్ద చేరాలని తనకు సూచించారని కుమారస్వామి వెల్లడించారు. 

ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఒక్క నిమిషం కూడా వృథా చేయవద్దని కుమారస్వామి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాను తెల్లవారుజామున 2 గంటలకు పక్షవాతం లక్షణాలను పసిగట్టానని.. దానిని తాను పట్టించుకోకుండా వుండి వుంటే జీవితాంతం మంచంపై గడపాల్సి వచ్చేదని ఆయన తెలిపారు. డాక్టర్లు డబ్బు సంపాదన కోసం పనిచేస్తున్నారని ఎప్పుడూ అనుకోవద్దని.. ఎందుకంటే రోగి వచ్చినప్పుడు వారిని రక్షించడానికి వారు శక్తివంచన లేకండా కృషి చేస్తారని కుమారస్వామి ప్రశంసించారు. 

ప్రముఖ న్యూరాలజిస్ట్.. నిమ్‌హాన్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ పీ.సతీశ్ చంద్ర మాట్లాడుతూ.. పక్షవాతాన్ని గుర్తించేందుకు బీఈ ఫాస్ట్ పద్దతిపై అవగాహన కలిగి వుండాలని తెలిపారు. బీ అంటే బ్యాలెన్స్, ఈ అంటే ఐఎస్... ఎఫ్ ఫర్ ఫేస్.. ఏ ఫర్ ఆర్మ్స్, ఎస్ ఫర్ స్పీచ్, టీ ఫర్ టైమ్ అని చెప్పారు. చేతికి బలం తగ్గితే.. పెదవి విప్పినా, తడబడినా, కళ్లలో ఇబ్బంది వున్నారు, ముఖంలో మార్పులు కనిపిస్తే సమయం వృథా చేసుకోకుండా ఆసుపత్రికి వెళ్లాలని సతీశ్ ప్రజలకు సూచించారు. రోగిని సరైన ఆసుపత్రికి తీసుకెళ్లడం కూడా చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. సదరు ఆసుపత్రిలో స్ట్రోక్ సిద్ధంగా వుండాలని సూచించారు.