భారత్ - కెనడా ఉద్రిక్తతలు .. ఇండియాను వీడనున్న కెనడా ఇంటెలిజెన్స్ చీఫ్ ఆలివర్ సిల్వెస్టర్ ..?
కెనడా గూఢచారి, ఆ దేశ ఇంటెలిజెన్స్ స్టేషన్ చీఫ్ శుక్రవారం భారత్‌ను వదిలి వెళ్లనున్నారు. సిల్వెస్టర్‌కు దేశం విడిచి వెళ్లడానికి భారత్ ఐదు రోజులు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఖలిస్తాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం వుండొచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై భారత్ ఘాటుగా బదులిచ్చింది భారత్‌లోని కెనడా సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరించింది. ఈ క్రమంలో కెనడా గూఢచారి, ఆ దేశ ఇంటెలిజెన్స్ స్టేషన్ చీఫ్ శుక్రవారం భారత్‌ను వదిలి వెళ్లనున్నారు. సిల్వెస్టర్‌కు దేశం విడిచి వెళ్లడానికి భారత్ ఐదు రోజులు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే.
భారత అంతర్గత వ్యవహారాల్లో కెనడా దౌత్యవేత్తలు జోక్యం చేసుకోవడం, భారత్‌కు వ్యతిరేకంగా జరిగేప కార్యకలాపాల్లో వారి ప్రమేయాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది విదేశాంగ శాఖ. కెనడాలోని భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) అధిపతి పవన్ కుమార్ రాయ్‌ను దేశ సార్వభౌమత్వానికి ముప్పుగా పరిగణిస్తూ ఆయనను కెనడా నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ కార్యాలయం సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిగా భారత్ కూడా సిల్వెస్టర్‌ను బహిష్కరించింది.
Also Read: తీవ్రవాదులకు సురక్షిత స్వర్గధామంగా కెనడా : ట్రూడోకు ఇచ్చిపడేసిన భారత్
ఇక గురువారం జరిగిన మీడియా సమావేశంలో కెనడాపై విరుచుకుపడ్డారు భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి అరిందమ్ బాగ్చి. నిజ్జర్ హత్య, తదితర పరిణామాలపై ట్రూడో చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రేరేపితమని ఆయన పేర్కొన్నారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారతీయ ఏజెంట్లకు మధ్య వున్న సంబంధం వున్నట్లు ట్రూడో చేసిన ఆరోపణలపై ఎలాంటి ఆధారాలు లేవని బాగ్చి అన్నారు. కెనడియన్లకు వీసాల సస్పెన్స్‌పై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. భద్రతా సమస్యల కారణంగా, అక్కడి సేవలకు ఆటంకం ఏర్పడినందున కెనడాలోని భారత హైకమీషన్ , కాన్సులేట్‌లు తాత్కాలికంగా వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేయలేకపోయాయని అరిందమ్ బాగ్చి స్పష్టం చేశారు.
ఉగ్రవాదులకు కెనడా సురక్షితమైన స్వర్గధామంగా మారుతోందని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాదులు, వ్యవస్థీకృత నేరాల కోసం అంతర్జాతీయ ఖ్యాతి విషయంలో ఆ దేశం ఆందోళన చెందుతోందన్నారు. మరోవైపు.. కెనడాతో దౌత్యపరమైన వివాదంపై భారత్ తన ప్రధాన మిత్రదేశాలకు తన అభిప్రాయాలను తెలియజేసిందా అని విలేకరులు అడిగిన ప్రశ్నలకు బాగ్చి అవును అని సమాధానం ఇచ్చారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కెనడాకు వెళ్లాలనుకునే భారతీయులు, ఇప్పటికే కెనడాలో వున్న విద్యార్ధులు, పౌరులు జాగ్రత్తగా వుండాలని అరిందమ్ బాగ్చి సూచించారు.