చెన్నై:అన్నాడీఎంకె అధినేత్రి, దివంగత తమిళనాడు మాజీ సీఎం  జయలలితకు అసెంబ్లీ సాక్షిగా  ఘోర అవమానం జరిగింది. డీఎంకె  ఎమ్మెల్యేలు  జయలలిత చీరను లాగేసిన ఘటన అప్పట్లో సంచలనం కల్గించింది. జయలలితను ఉద్దేశించి అసెంబ్లీలో కరుణానిధి చేసిన వ్యాఖ్యలు  గందరగోళాన్ని సృష్టించాయి.

1989లో తిరిగి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన కరుణానిధి హయాంలో అసెంబ్లీలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా జయలలితకు నిండు సభ సాక్షిగా ఘోర అవమానం జరిగింది. డీఎంకే ఎమ్మెల్యేలు ఆమె హెడ్ ఫోన్లు లాగేశారు. ఈ సమయంలో ఆమెను ఉద్దేశించి కరుణానిధి చేసిన వ్యాఖ్యలతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. దురై మురుగన్ అనే డీఎంకే సభ్యుడు జయలలిత చీర లాగేందుకు సాహసించడంతో సభను వాయిదా వేశారు నాటి స్పీకర్. 

అలా నాడు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన జయలలిత.. 1991లో అధికారంలోకి వచ్చే వరకు నిండు సభలో అడుగుపెట్టలేదు. అంతకుముందు 1991లో శాంతిభద్రతలను పరిరక్షించడంలో విఫలమైందని కరుణానిధి ప్రభుత్వాన్ని కేంద్రం రద్దు చేసింది. ఆ తర్వాత జరిగిన మధ్యంతర ఎన్నికల్లోనే జయలలిత సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. 

1996లో పార్లమెంట్‌తోపాటు రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన జమిలీ ఎన్నికల్లో ముపనార్ సారథ్యంలోని తమిళ మనీలా కాంగ్రెస్ (టీఎంసీ)తో కలిసి విజయం సాధించి తిరిగి అధికారంలోకి వచ్చారు కరుణానిధి. తిరిగి 2006లో చివరిసారిగా సీఎంగా పదవీ బాద్యతలు నిర్వర్తించిన కరుణానిధి ప్రస్తుతం తిరువారూర్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

1957 నుంచి 2016 వరకు జరిగిన ఎన్నికల్లో 13 సార్లు అసెంబ్లీకి ఎన్నికైన సీనియర్ రాజకీయ నేత కరుణానిధి మాత్రమే అంటే అతిశయోక్తి కాదు. 2011, 2016 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఓటమి పాలైన డీఎంకే ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తోంది. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.