కుక్కగా అవతారమెత్తిన జపాన్ వాసి, 20 వేల డాలర్లు ఖర్చు పెట్టి మరీ..!
జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి కుక్క అవతారం ఎత్తాడు. అందుకోసం ఓ ప్రముఖ కంపెనీకి 20 వేల అమెరికా డాలర్లు ఖర్చు పెట్టి హైపర రియలిస్టిక్ డాగ్ ఔట్‌ఫిట్‌ను తయారు చేయించుకున్నాడు.

న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన ఓ వ్యక్తికి చిన్నప్పటి నుంచి జంతువులా మారాలనే బలమైన కోరిక ఉంది. ఎలాగైనా జంతువు అవతారం ఎత్తాలనే కంకణం కట్టుకున్నాడు. ఏకంగా 20 వేల అమెరికన్ డాలర్లు ఖర్చు పెట్టి మరీ కుక్క అవతారమెత్తాడు. కుక్క అవతారంలో ఉన్న ఆ వ్యక్తికి సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో ఉన్నది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నది.
ఆ వ్యక్తి కలను సాకారం చేయడానికి జపాన్‌కు చెందిన జెప్పెట్ కంపెనీ సహకరించింది. ఈ కంపెనీ టీవీ యాడ్లు, సినిమాల కోసం కాస్ట్యూమ్స్ తయారు చేస్తుంది. ఈ వ్యక్తి కోసం ఒక హైపర్ రియలిస్టిక్ కుక్క ఔట్‌ఫిట్‌ను తయారు చేసింది. దీనికి 40 రోజుల సమయం తీసుకుంది. బాడీ సూట్లు, ఫిగరైన్లు, 3డీ మాడల్స్ తయారు చేయడంలో ఈ కంపెనీది అందె వేసిన చేయి. ఎట్టకేలకు ఆ వ్యక్తికి కావాల్సిన రీతిలో వాస్తవంగా కుక్కే అని భ్రమించేలా రియాలిస్టిక్‌లో శునకం ఔట్‌ఫిట్‌ను రూపొందించింది. ఆ ఔట్‌ఫిట్ ధరిస్తే సదరు వ్యక్తి కుక్కలాగే కనిపిస్తాడు. నిజమైన కుక్కలా కనిపిస్తూ.. నాలుగు కాళ్లపై నడుస్తూ కనిపిస్తాడు.
ఆ వ్యక్తి ఓ యూట్యూబ్ చానెల్ నడుపుతున్నాడు. ఆ యూట్యూబ్ చానెల్ పేరు ఐ వాంట్ టు బీ యాన్ యానిమల్. 31 వేల సబ్‌స్క్రైబర్లు ఉన్న ఆ యూట్యూబ్ చానెల్‌లో తన శునకావతారాన్ని చూపించే వీడియోకు పది లక్షలకు మించి వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో ఏడాది క్రితమే రికార్డ్ చేశారు. కానీ, ఈ మధ్యే యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. జర్మన్ టీవీ స్టేషన్ ఆర్‌టీఎల్ చేసిన ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోనే ఇది.
‘నా కలను సాకారం చేసుకుంటూ నేను కోలీ డాగ్ అయ్యాను. చిన్నప్పటి నుంచి జంతువుగా మారాలనే నా కల నిజమైంది’ అని ఆ వీడియో సబ్‌టైటిల్స్‌లో కనిపించింది. ఈయనను టాకో అని పిస్తున్నారు.
ఆ వీడగియోలో మెడకు ఓ బెల్ట్‌ను కట్టుకుని బయటికి నడుచుకుంటూ తీసుకెళ్లారు. ఆ హ్యూమన్ డాగ్.. ఇతర కుక్కల వాసనలు చూసింది. సాధారణ కుక్కల్లాగే నేలపై పొర్లింది.
టాకో గతేడాది కూడా కొన్ని మీడియా సంస్థలకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘నేను నా అలవాట్లను ఇతరులకు తెలియాలని అనుకోను. ముఖ్యంగా నాతో కలిసి పని చేసే వాళ్లకు అసలే తెలియకూడదని అనుకుంటాను. నేను కుక్కగా మారాలని కోరుకుంటున్నానని తెలిస్తే వారు నన్ను ఒక పిచ్చివాడిగా చూసే అవకాశం ఉన్నది. నేను కుక్క అని తెలిశాక, నా కుటుంబం, మిత్రులు ఆశ్చర్యపడ్డట్టు వివరించారు.