పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి పట్ల పవన్ కల్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. కాలేజీ యాజమాన్యం సకాలంలో స్పందిస్తే ఇంత దారుణం జరగకపోయి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

అమరావతి : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరంగల్ ఎంజీఎం పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. డాక్టర్ ప్రీతి మరణం అత్యంత బాధాకరమైన విషయమని అన్నారు. సోమవారం ఈ మేరకు ప్రీతికి నివాళి అర్పిస్తూ పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేశారు. గత ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడుతూ తుది శ్వాస విడిచిన డాక్టర్ ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రీతి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

డాక్టర్ ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పరిస్థితులు.. సీనియర్ విద్యార్థి అయిన సైఫ్ వేధింపులు భరించలేక ఆమె తీసుకున్న నిర్ణయం తనను బాధించిందని అన్నారు. కన్నవారి మానసిక వేదన గురించి తెలుసుకుంటూ ఉంటే తన హృదయం ద్రవించిందని తెలిపారు. సైఫ్ వేధింపుల గురించి ప్రీతి తల్లిదండ్రులకు చెప్పిన తర్వాత.. కాలేజీ యాజమాన్యానికి వారు ఫిర్యాదు చేసిన వెంటనే బాధ్యులపై సరైన చర్యలు తీసుకుంటే పరిస్థితి వేరేలా ఉండేదని.. ఇంత దారుణమైన పరిస్థితి వచ్చేది కాదని బాధను వ్యక్తం చేశారు.

అందరూ ఒక్కటై నా చెల్లిని ఒంటరిని చేసి.. వేధించారు : ప్రీతి సోదరి పూజ

వేధింపులకు పాల్పడి డాక్టర్ ప్రీతి ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడైన నిందితుడిని ఉపేక్షించకూడదని… కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాలేజీల్లో ర్యాగింగ్ లు, వేధింపులు అరికట్టాలని.. ర్యాగింగ్ మీద నిషేధం విధించినప్పటికీ కొన్నిచోట్ల ఇంకా అది వెలుగు చూడడం బాధాకరమైన విషయమన్నారు. దీనిని అరికట్టడంపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్తగా కాలేజీలోకి వచ్చిన వారిని స్నేహపూర్వకంగా కలుపుకుపోవాలని.. ర్యాగింగ్ కు, వేధింపులకు పాల్పడకూడదని.. ఈ విషయంలో సీనియర్ విద్యార్థుల ఆలోచనా ధోరణిలో మార్పు రావాలని సూచించారు. జూనియర్లను తమ కుటుంబ సభ్యుల ఆదరించాలని.. అంతేకానీ ఇలా వేధింపులకు గురి చేయకూడదని పవన్ కళ్యాణ్ యువతకు హితవు పలికారు.

ఇదిలా ఉండగా, కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని ప్రీతి మృతి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఐదు రోజులుగా చికిత్స తీసుకుంటూ ఆదివారం రాత్రి మృతి చెందిన అనస్తీసియా పీజీ మొదటి సంవత్సరం విద్యార్థిని ధారావత్ ప్రీతి మృతిపట్ల ఆమె అక్క పూజ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తమ సోదరి మృతి మీద తమకు అనేక అనుమానాలు ఉన్నాయని ఆమె తెలిపింది. గిరిజన తెగకు చెందిన అమ్మాయి అనే అందరూ కలిసి తన చెల్లిని ఒంటరి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు కొన్ని మీడియా కథనాలు వెలువడ్డాయి. 

సోదరి బ్యాచ్ మేట్స్ అందరూ విడిగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారని.. ఆ గ్రూపులో తన చెల్లెలి గురించి చర్చించుకునే వారిని చెప్పుకొచ్చింది. సీనియర్లు, తోటి పీజీలు అంతా ఒకటయ్యారని.. తన చెల్లిని వేధించారని.. దీనిమీద కాలేజీ ప్రిన్సిపాల్ కి, హెచ్ఓడికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన చెల్లి ఆత్మహత్యాయత్నం విచారణను పోలీసులు మధ్యలోనే ఆపేశారని.. ఎందుకు విచారణ ఆపేశారని ప్రశ్నించింది. తన చెల్లి మృతి కేసులో నిజానిజాలు ఏమున్నాయో నిగ్గు తేలాలని డిమాండ్ చేశారు.