ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ క్రమంలోనే Uttar Pradesh, Punjab, Uttarakhand రాష్ట్రాలకు సంబంధించిన తాజా ఒపీనియన్ పోల్స్ ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నాయి.
ప్రస్తుతం దేశంలోని ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న అసంబ్లీ ఎన్నికలపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన తాజా ఒపీనియన్ పోల్స్ ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నాయి. జన్ కీ బాత్- ఇండియా న్యూస్ (Jan Ki Baat India News polls) నిర్వహించిన ఒపీనియన్ పోల్స్‌లో మూడు రాష్ట్రాల్లో రెండింటిలో బీజేపీ అధికారం కైవసం చేసుకోనుందని పేర్కొంది. జనవరి 28న వెలువరించిన ఈ ఒపీనియన్ పోల్ ప్రకారం.. Uttar Pradesh, Uttarakhandలలో బీజేపీ అధికారం దక్కించుకోనుందని.. Punjabలో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం పీఠం కైవసం చేసుకోనుంది.
ఉత్తరప్రదేశ్ పీఠం మళ్లీ కాషాయ పార్టీదే..
ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ కమలం వికసించవచ్చని సర్వే పేర్కొంది. దాదాపు 41 శాతం ఓట్లతో బీజేపీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని తెలిపింది. అదే సమయంలో సమాజ్ వాదీ పార్టీ నేతృత్వంలోని కూటమికి 38 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. జనవరి 16 నుంచి జనవరి 26 వరకు ఈ సర్వే కోసం అభిప్రాయ సేకరణ చేసినట్టుగా వెల్లడించింది. సర్వే సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో 20 వేల మందితో మాట్లాడినట్టుగా తెలిపింది. సర్వేలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలతో మమేకమయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా పేర్కొంది.
సర్వే ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం తిరిగి అధికారం చేపడుతోంది. ఒపీనియన్ పోల్‌లో 18-35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారిలో 35 శాతం మంది, 35-45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారిలో 45 శాతం మంది, 45 ఏళ్లు పైబడిన వారిలో 25 శాతం మంది నుంచి అభిప్రాయం సేకరించారు.
ఒపీనియన్ పోల్స్ ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 403 సీట్లలో.. బీజేపీ నేతృత్వంలోని కూటమికి 223-239 సీట్లు, సమాజ్‌వాదీ పార్టీ నేతృత్వంలోని కూటమి 165-151 సీట్లతో సరిపెట్టుకోవాల్సి రావచ్చు. బీఎస్పీకి 8-10 సీట్లు, కాంగ్రెస్‌కు 1, ఇతరులకు 4 సీట్లు వస్తాయని అంచనా. 2017 ఎన్నికల్లో ఎస్పీకి 47 సీట్లు వచ్చాయి. ఈ సారి ఆ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందనుంది. ఎస్పీ భారీగా పుంజుకున్నప్పటికీ అధికారం కైవసం చేసుకోవడం కష్టమేనని సర్వే ద్వారా తెలుస్తోంది. ఓట్ల విషయానికి వస్తే.. బీజేపీ కూటమికి.. 41-43 శాతం ఓట్లు, సమాజ్‌వాదీ పార్టీ కూటమికి 38-40 శాతం ఓట్లు, బీఎస్పీకి 10-12 శాతం, కాంగ్రెస్‌కు 3-4 శాతం, ఇతరులకు 4-5 శాతం ఓట్లు రావచ్చని అంచనా. సర్వేలో పాల్గొన్న వారిలో యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌కు 51 శాతం మంది ప్రజలు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. 38 శాతం మంది ప్రజలు అఖిలేష్ యాదవ్‌కు సీఎం అభ్యర్థిగా అభివర్ణించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి ముఖ్యమంత్రి కావాలని 8 శాతం మంది, ప్రియాంక గాంధీని ముఖ్యమంత్రి కావాలని 2 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నట్టుగా సర్వే వెల్లడించింది.
పంజాబ్‌లో కాంగ్రెస్‌కు షాక్..
జన్ కీ బాత్ ఒపీనియన్ పోల్ పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అంచనా వేసింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి షాక్ తప్పదని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థిత్వం కోసం ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య జరిగిన పోరు కాంగ్రెస్‌కు భారీ నష్టాన్ని మిగిల్చవచ్చని తెలిపింది. జనవరి 16 నుంచి జనవరి 26 వరకు సర్వే నిర్వహించినట్టుగా ఆ సంస్థ పేర్కొంది. పంజాబ్‌లో సర్వే సందర్భంగా 10 వేల మందితో మాట్లాడినట్టుగా వెల్లడించింది.
సర్వే ప్రకారం.. పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో అవకాశం ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా లేరు. అభిప్రాయ సేకరణలో.. 18-25 సంవత్సరాల వయస్సు గల వారిలో 10 శాతం, 25-35 సంవత్సరాలలో 30 శాతం, 35-45 సంవత్సరాలలో 45 శాతం, 55 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారిలో 15 శాతం మంది పాల్గొనేలా చూశారు. పంజాబ్‌లోని మొత్తం 117 సీట్లలో ఆప్ 60-63, కాంగ్రెస్‌కు 36-40, ఎస్‌ఎడి (శిరోమణి అకాలీదళ్) 14-17, బిజెపి+ 0-4 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని ఒపీనియన్ పోల్ అంచనా వేసింది.
ఒపీనియన్ పోల్స్ ప్రకారం ఆప్‌కు 40-41 శాతం, కాంగ్రెస్‌కు 35-36 శాతం, ఎస్ఏడీకు 13-17 శాతం, బీజేపీ కూటమికి 7-8 శాతం, ఇతరులకు 1-2 శాతం ఓట్లు రావచ్చు. మాల్వా ప్రాంతంలోని మొత్తం 69 స్థానాల్లో.. ఆప్ 38 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ 21 సీట్లు, SAD 9 మరియు బీజేపీ కూటమి 1 సీటును పొందవచ్చు. మంఝా ప్రాంతంలోని 25 స్థానాల్లో ఆప్‌కి 18, కాంగ్రెస్‌కు 6, ఎస్‌ఏడీకి 1 సీటు దక్కుతుందని అంచనా వేసింది. దోబా ప్రాంతంలోని 23 స్థానాల్లో.. ఆప్ 6, కాంగ్రెస్ 11, SAD 5 మరియు BJP+ ఒక సీటును పొందగలవని సర్వే పేర్కొంది.
సర్వేలో.. ‘అంతర్గత వర్గపోరు వల్ల కాంగ్రెస్ ఓడిపోతుందా?’ అనే ప్రశ్నకు 70 శాతం మంది అవును అని, 30 శాతం మంది కాదని సమాధానమిచ్చారు. రాష్ట్రంలోని మహిళలు ఎక్కువగా ఆప్‌కు మద్దతు తెలుపుతున్నారు. ఆప్‌కు 50 శాతం, కాంగ్రెస్‌కు 36 శాతం, ఎస్‌ఏడీకి 7 శాతం, బీజేపీ+ 3 శాతం, ఇతరులకు 4 శాతం మహిళలు మద్దతు ఉన్నట్టుగా సర్వే అంచనా వేసింది.
ఉత్తరాఖండ్‌లో హోరాహోరీ.. కానీ బీజేపీ వైపే మొగ్గు..
జన్ కీ బాత్ సర్వే ప్రకారం.. ఉత్తరాఖండ్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగే సూచనలు కనిపిస్తున్నాయి. జనవరి 16 నుంచి జనవరి 26 వరకు సర్వే నిర్వహించినట్టుగా ఆ సంస్థ పేర్కొంది. ఉత్తరాఖండ్‌లో నిర్వహించిన సర్వే సందర్భంగా 5 వేల మంది అభిప్రాయాలు సేకరించినట్టుగా తెలిపింది. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీగా తలపడిన.. బీజేపీ తక్కువ మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని తెలిపింది. బీజేపీ 36 నుంచి 37 సీట్లు, కాంగ్రెస్ గట్టిపోటీనిచ్చినా 26 నుంచి 32 స్థానాలకు పరిమితం అవుతుందని సర్వే అంచనా వేసింది.
