సారాంశం

Rajori Encounter: జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రాజౌరీలో బుధవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్ కౌంటర్ కొనసాగుతోంది.  

Rajori Encounter: జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లా కలకోట్ అడవుల్లో బుధవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఆర్మీ అధికారులు, ఇద్దరు సైనికులు మరణించారు. అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల నేపథ్యంలో ఆర్మీ ప్రత్యేక బలగాలు, పోలీసులు సంయుక్త ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులు ఎదురుపడటంతో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది.

గత కొన్నేళ్లుగా జమ్మూ కాశ్మీర్‌లోని పీర్ పంజాల్ అటవీ ప్రాంతంలోకి ఉగ్రవాదుల అక్రమ చోరబాటు భద్రతా దళాలకు సవాలుగా మారింది. టెర్రరిస్టులు ఈ అడవి ప్రాంతాన్ని తమ స్థావరంగా మార్చుకుంటూ.. ఉగ్ర కార్యక్రమాలకు కేంద్రంగా మార్చుకున్నారు. దీంతో ఈ అడవిలోకి చొరబడిన ఉగ్రవాదుల కోసం ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు గత నెల రోజులుగా జాయింట్ ఆపరేషన్‌లో వెతుకుతున్నారు.

ఈ క్రమంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ సెర్చ్ ఆపరేషన్‌లో బుధవారం తెల్లవారుజామున భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. అడవిలో దాక్కున్న ఉగ్రవాదుల వద్ద భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఉండవచ్చని సమాచారం. ఉగ్రవాదుల ఆచూకీ కోసం సైన్యం, పోలీసుల కంబైడ్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
 
జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీలోని కలకోట్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌పై, ఇండియన్ ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో మాట్లాడుతూ.. "ఉగ్రవాదులు గాయపడ్డారు,భద్రతా బలగాలు వారిని చుట్టుముట్టారు. ఆపరేషన్ కొనసాగుతోంది." అని తెలిపారు.

అంతకుముందు నవంబర్ 17 న జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో లష్కరే తోయిబాకు చెందిన 5 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గాం పోలీసులు సమాచారం ఇవ్వగా, మేము సైన్యం సహకారంతో ఆపరేషన్ నిర్వహించామని చెప్పారు.

భద్రతా బలగాలు కుల్గామ్‌లోని నేహమా గ్రామాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదులను సమీర్ అహ్మద్ షేక్, యాసిర్ బిలాల్ భట్, డానిష్ అహ్మద్ థోకర్, హంజుల్లా యాకూబ్ షా, ఉబైద్ అహ్మద్ పాడేర్‌లుగా గుర్తించారు. శ్రీనగర్ హైవే బైపాస్‌లో లష్కర్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు పట్టుకున్నాయి

ఇది కాకుండా.. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, CRPF మంగళవారం (నవంబర్ 21) శ్రీనగర్‌లోని నేషనల్ హైవే బైపాస్ నుండి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాద సహచరులను అరెస్టు చేయడంలో గొప్ప విజయాన్ని సాధించాయి. వారి వద్ద నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.