Asianet News TeluguAsianet News Telugu

కశ్మీర్ సమస్యను పరిష్కరించాలనుకున్న ఏకైక పాకిస్తాన్ జనరల్: ముషారఫ్‌కు కశ్మీర్ లీడర్ మెహబూబా ముఫ్తీ నివాళి

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ మరణంపై జమ్ము కశ్మీర్ నేత, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ స్పందించారు. జమ్ము కశ్మీర్ సమస్య కోసం నిజాయితీగా ప్రయత్నించిన ఏకైక పాకిస్తాన్ నేత ఆయనే అని పేర్కొన్నారు.
 

jammu kashmir leader mehbooba mufti praises pervez musharraf
Author
First Published Feb 5, 2023, 5:24 PM IST

న్యూఢిల్లీ: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, మిలిటరీ పాలకుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ 79వ యేటా దుబాయ్‌లో ఈ రోజు కన్నుమూశారు. సుమారు పదేళ్లు పాకిస్తాన్ పాలకుడిగా ఉన్నప్పుడు ఎన్నో పరిణామాలు ఉభయ దేశాల మధ్య జరిగాయి. కార్గిల్ యుద్ధానికి నిర్మాత అతనే కావడమేకాదు.. జమ్ము కశ్మీర్ సమస్య పరిష్కారానికీ నిజాయితీగా ప్రయత్నించాడని చాలా మంది చెబుతుంటారు. ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల కోసమే కాదు.. ఇరు దేశాల ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలు నిర్వహించుకోవడానికీ ఆయన చర్యలు తీసుకున్నట్టు విశ్లేషకులు పేర్కొంటూ ఉంటారు. ఆయన మరణంపై నివాళులు అర్పించే భారత నేతలు ఉన్నారు.

పర్వేజ్ ముషారఫ్ మరణంపై కాంగ్రెస్ సీనియర్ లీడర్ శశిథరూర్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా నివాళి అర్పించారు. ఒకప్పుడు ఆయన భారత దేశానికి శత్రువుగా ఉండగా 2002 నుంచి 2007 కాలంలో శాంతి దూతగా వ్యవహరించారని వివరించారు. ఆ కాలంలో ఐరాసలో అతడిని కలుస్తుండేవాడని, ఆయన చాలా స్మార్ట్ అయిన, స్పష్టమైన వ్యూహాత్మక ఆలోచనలు కలిగిన వ్యక్తి అని పొగిడారు. శశిథరూర్ కామెంట్ పై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. కాగా, జమ్ము కశ్మీర్ కీలక నేత, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కూడా ముషారఫ్ మరణంపై వ్యాఖ్యానించారు.

Also Read: పర్వేజ్ ముషారఫ్ మరణం: కార్గిల్ యుద్ధం మాస్టర్ మైండ్, కశ్మీర్ సమస్య పరిష్కారానికి ప్రయత్నం.. ఆసక్తికర వాస్తవాలు

పర్వేజ్ ముషారఫ్ నివాళులు అర్పిస్తూ  మెహబూబా ముఫ్తి ట్విట్టర్‌లో రియాక్ట్ అయ్యారు. ప్రగాఢ సంతాపం అని పేర్కొంటూ కశ్మీర్ సమస్యను నిజాయితీగా పరిష్కరించడానికి ప్రయత్నించిన ఏకైక పాకిస్తాన్ జనరల్ అని తెలిపారు. జమ్ము కశ్మీర్ ప్రజలకు అనుగుణంగా, భారత్, పాకిస్తాన్‌లకు ఆమోదయోగ్యమైన పరిష్కారాం కావాలని అనుకున్నారని వివరించారు. అయితే, ఆయన, అటల్ బిహారీ వాజ్‌పేయిల కృషిని కేంద్ర ప్రభుత్వం రివర్స్ చేసిందని ఆరోపించారు. కేవలం కాల్పుల విరమణ ఒప్పందం మాత్రమే కొనసాగుతున్నదని పేర్కొన్నారు.

కశ్మీర్ ఇష్యూ సెటిల్ కావడానికి ముషారఫ్ నాలుగు పాయింట్ల సూత్రాన్ని పేర్కొనేవాడు. అందులో ఎల్‌వోసీ వద్ద ఇరు వైపులా మిలిటరీని తగ్గించడం, ప్రజలను సరిహద్దుకు అటు వైపు, ఇటు వైపు స్వేచ్ఛగా తిరగడానికి అనుకూలించే వాతావరణం నిర్మించడం, స్వాతంత్ర్యం లేకున్నా స్వయం పాలిత ప్రభుత్వానికి అనుమతించడం వంటి జాయింట్ మెకానిజం ద్వారా జమ్ము కశ్మీర్ మేనేజ్‌ చేయాలని ప్రతిపాదించాడు. అటల్ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాలు ఇందుకు అనుకూలంగానే నడిచాయి. ఒక్కసారి మన్మోహన్ సింగ్ పాకిస్తాన్ పర్యటించి డీల్ ఫైనలైజ్ చేస్తే జమ్ము కశ్మీర్ సమస్య చాలా వరకు సద్దుమణిగేదే. కానీ, అది కార్యరూపం దాల్చలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios