ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా జమ్మూకాశ్మీర్‌ ఎన్నికలకు సిద్ధమైంది. రాష్ట్రంలోని దాదాపు 13,000 పంచాయతీలకు వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర అధికార యంత్రాంగం విస్త్రృతంగా ఏర్పాట్లు చేస్తోంది.

మార్చి 5 నుంచి 20 మధ్య మొత్తం 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. పూర్తిగా బ్యాలెట్ పద్ధతిలోనే ఈ ఎన్నికలు నిర్వహించనున్నట్లు జమ్మూకాశ్మీర్ ఎన్నికల సంఘం తెలిపింది.

కేంద్ర పాలిత ప్రాంతంగా కాశ్మీర్‌ను ప్రకటించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం జేసీ మర్మును అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించింది. ప్రస్తుతం అక్కడ పరిపాలనంతా కేంద్రం ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతోంది.

Also Read:స్వయం ప్రతిపత్తి రద్దు: కాశ్మీర్‌ను చీల్చిన కేంద్రం, గెజిట్ విడుదల

2018లో జరిగిన పంచాయతీ ఎన్నికలను అక్కడి పీపుల్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ), నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీపీ) బహిష్కరించిన సంగతి తెలిసిందే. దీంతో కాశ్మీర్‌లో 12,500 పంచాయతీలు సర్పంచ్‌లు లేక ఖాళీగా ఉన్నాయి. దీంతో ఆ స్థానాలకు తిరిగి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత అల్లర్లు చోటు చేసుకోకుండా, ఎలాంటి హింసాత్మక వాతావరణానికి తావు లేకుండా అక్కడి ప్రముఖ రాజకీయ నాయకులు ఫరూఖ్ అబ్ధుల్లా, ఒమర్ అబ్ధుల్లా, మెహబూబా ముఫ్తీని ప్రభుత్వం గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. 

Also Read:కాశ్మీర్ ఇష్యూ: ప్రత్యేక హక్కులేమిటి, 370 ఆర్టికల్ ఏమిటి?

జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టులో రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. దీని కారణంగా జమ్మూకాశ్మీర్ తన స్వయం ప్రతిపత్తిని కోల్పోవడంతో పాటు మూడు ముక్కలైంది.