Asianet News TeluguAsianet News Telugu

పండుగకు వస్తానని తల్లికి మాటిచ్చిన లెఫ్టినెంట్.. సెలవు రీ షెడ్యూల్ అయింది.. పాపం అంతలోనే..

రిషి కుమార్.. రెండు నెలల క్రితం 17 సిక్కు లైట్ ఇన్‌ఫాంట్రీలో భాగంగా కశ్మీర్‌లో నియమించబడ్డారు. అతను భారత సైన్యంలో చేరి కేవలం ఒక సంవత్సరం మాత్రమే పూర్తి అయింది. నవంబర్ నెలఖారులో రిషి చెల్లెలు వివాహం జరగాల్సి ఉండటంతో..  కుటుంబం మొత్తం ఆనందంలో వేడుకలు జరపడానికి అంతా సిద్దం చేసుకుంటుంది.

Jammu and kashmir landmine blast Lieutenant Rishi Kumar could not keep the promise he made to his mother
Author
Begusarai, First Published Nov 1, 2021, 2:32 PM IST

జమ్మూ కశ్మీర్‌లోని  నౌషెరా సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద శనివారం పెట్రోలింగ్ చేస్తున్న  సమయంలో మందుపాతరలు పేలి ఇద్దరు  సైనికులు వీర మరణం పొందారు. వీరిని బిహార్‌కు చెందిన ఆర్మీ లెఫ్టినెంట్ రిషి కుమార్, పంజాబ్‌కు చెందిన జవాన్ మంజిత్‌లుగా గుర్తించారు. గాయపడిన మరో సైనికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే జవాన్ల మరణంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ముఖ్యంగా సోదరి వివాహానికి ఇంటికి తిరిగి వస్తానని తల్లికి మాట ఇచ్చిన లెఫ్టినెంట్ రుషి కుమార్ ఆ మాటను నిలుపుకోలేకపోయాడు. నవంబర్ చివరి వారంలో వివాహా వేడుకలు  జరగాల్సిన  ఆ ఇంట్లో విషాదం నెలకొంది.

బీహార్‌లోని బెగుసరాయ్‌కు చెందిన లెఫ్టినెంట్ రిషి కుమార్, జవాన్ మంజిత్‌లు.. అక్టోబర్ 30న ఆపరేషన్ సమయంలో ల్యాండ్‌మైన్‌ పొరపాటున కాలు  వేయడంతో మరణించారు. వీర మరణం పొందిన  ఇద్దరు.. ధైర్యవంతులని, తమ వృత్తి పట్ల ఎంతో నిబద్ధతతో ఉన్నారని దేశం కోసం వారి ప్రాణాలను త్యాగం  చేశారని భారత ఆర్మీ  ఒక ప్రకటనలో పేర్కొంది. వారి త్యాగానికి దేశ ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుందని పేర్కొంది. ఇక, రిషి కుమార్.. రెండు నెలల క్రితం 17 సిక్కు లైట్ ఇన్‌ఫాంట్రీలో భాగంగా కశ్మీర్‌లో నియమించబడ్డారు. అతను భారత సైన్యంలో చేరి కేవలం ఒక సంవత్సరం మాత్రమే పూర్తి అయింది. 

Also read: పాకిస్తాన్ సరిహద్దులో మందుపాతర పేలి లెఫ్టినెంట్ అధికారి, జవాను దుర్మరణం

లెఫ్టినెంట్ రిషి మరణ వార్తను ఇండియన్ ఆర్మీ అధికారులు వెల్లడించిన  తర్వాత ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. నవంబర్ నెలఖారులో రిషి చెల్లెలు వివాహం జరగాల్సి ఉండటంతో..  కుటుంబం మొత్తం ఆనందంలో వేడుకలు జరపడానికి అంతా సిద్దం చేసుకుంటుంది. వారం  రోజుల్లో రిషి కూడా ఇంటికి చేరుకోవాల్సి  ఉంది. తొలుత అక్టోబర్ 27న ఛత్ పూజ కోసం రిషి కుమార్ ఇంటికి  వస్తానని  తన తల్లికి మాట ఇచ్చాడు. అయితే  అతని సెలవు రీ షెడ్యుల్ కావడంతో తన తల్లికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాడు. ఇక, చనిపోయే కొద్ది గంటల ముందు  రిషి తన తల్లితో చివరిసారిగా  ఫోన్‌లో మాట్లాడారు. 

దేశం కోసం సేవలిందిస్తున్న  రిషి.. ఇలా వీరమరణం  పొందడంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వారిని  ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు.  బెగుసరాయ్ ప్రాంతానికి  చెందిన కేంద్ర మంత్రి  గిరిరాజ్ సింగ్ కూడా రిషి ధైర్యసాహసాలకు సెల్యూట్ చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి  తెలిపారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లెఫ్టినెంట్ రిషి కుమార్ మృతికి సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలను పూర్తిగా పోలీసు గౌరవాలతో నిర్వహిస్తామని ప్రకటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios