జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదుల కాల్పుల్లో అమరులైన ఆర్మీ కల్నల్ , మేజర్
జమ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత ఆర్మీ కల్నల్‌తో పాటు రాష్ట్రీయ రైఫిల్స్ విభాగానికి కమాండర్‌గా వున్న ఒక మేజర్ ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.

జమ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత ఆర్మీ కల్నల్‌తో పాటు రాష్ట్రీయ రైఫిల్స్ విభాగానికి కమాండర్‌గా వున్న ఒక మేజర్ ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. ఈ రోజు తెల్లవారుజామున కోకెర్‌నాగ్ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ, జమ్మూకాశ్మీర్ పోలీస్ అధికారులు గాయపడ్డారు.
ఇదిలావుండగా.. మంగళవారం రాజౌరీలోని నార్తా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం సాయంత్రం జరిగిన సెర్చ్ ఆపరేషన్‌లో భద్రతా దళాలు పెద్ద మొత్తంలో వార్ డంప్‌లు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. వీటిపై పాక్ గుర్తులు వున్నట్లుగా సమాచారం.
సెప్టెంబర్ 7 నుంచి ఉగ్రవాదుల కదలికలపై భారత సైన్యం, జమ్మూకాశ్మీర్ పోలీసులు నిఘా వుంచారని డిఫెన్స్ పీఆర్‌వో లెఫ్టినెంట్ కల్నల్ సునీల్ బర్త్వాల్ తెలిపారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు వున్నట్లుగా తెలుసుకుని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయని.. సెప్టెంబర్ 12న భారీ కాల్పులు జరిగినట్లు ఆయన చెప్పారు. అదే రోజు రాత్రి ఒక ఉగ్రవాది హతమయ్యాడని.. సెప్టెంబర్ 13న ఉదయం రెండవ ఉగ్రవాదిని కూడా హతమార్చినట్లు పీఆర్వో తెలిపారు.
ఈ ఘటనలో భారీగా మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని, ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోగా, ఒక ఎస్‌పీవోతో పాటు ముగ్గురు సైనికులు గాయపడ్డారని సునీల్ వెల్లడించారు. ఓ ఆర్మీ జాగిలం కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు .. రాజౌరీలోని నార్లా ప్రాంతంలో జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో రెండో ఉగ్రవాదిని హతమార్చినట్లు జమ్మూ అడిషినల్ డీజీపీ ముఖేష్ సింగ్ తెలిపారు.