Jamiat Ulama-e-Hind: యూపీలోని దేవ్‌బంద్‌లో జరిగిన ముస్లిం సంస్థ జమియత్ ఉలమా-ఏ-హింద్ (Jamiat Ulama-e-Hind) రెండు రోజుల సమావేశంలో బీజేపీ కేంద్ర ప్ర‌భుత్వం అమలుచేయాల‌ని భావిస్తోన్న‌ యూనిఫాం సివిల్ కోడ్ కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించింది. 

Jamiat Ulama-e-Hind: ప్రాచీన ప్రార్థనా స్థలాలపై పదేపదే వివాదాలు లేవనెత్తుతూ.. దేశంలో శాంతి, ప్రశాంతతలను భంగం క‌లిగిస్తున్నాయ‌ని ప‌రోక్షంగా (బీజేపీ) రాజకీయ పార్టీల వైఖరి పట్ల జమియత్ ఉలమా-ఏ-హింద్ సమావేశం తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తంచేసింది. ఉత్తరప్రదేశ్‌ లోని దేవ్‌బంద్‌లో ఆదివారం జరిగిన సమావేశంలో జమియత్ ఉలమా-ఏ-హింద్ (Jamiat Ulama-e-Hind) ప్రతిపాదిత యూనిఫాం సివిల్ కోడ్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేసింది. యూనిఫాం సివిల్ కోడ్ వ్యక్తిగత చట్టాలను పాటించడాన్ని నిరోధిస్తుందని, తద్వారా భారత రాజ్యాంగంలోని హామీలకు విరుద్ధమని ముస్లిం సంస్థ పేర్కొంది. ఇది రాజ్యాంగ స్ఫూర్తిని విస్మరించడమేనని తీర్మానంలో పేర్కొంది. 

ఇస్లామిక్ చట్టాల‌పై ఇత‌రుల జోక్యాన్ని ఏ ముస్లిం అంగీకరించడనీ, ఏదైనా ప్రభుత్వం UCCని అమలు చేయడంలో తప్పు చేస్తే.. ముస్లింలు ఈ అన్యాయాన్ని అంగీకరించరనీ, రాజ్యాంగ పరిమితుల్లో ఉంటూనే దానికి వ్యతిరేకంగా అన్ని చర్యలు తీసుకోవలసి వస్తుందని Jamiat Ulama-e-Hind పేర్కొంది. యూనిఫాం సివిల్ కోడ్ అనేది.. వారి మతం, లింగం మొదలైన వాటితో సంబంధం లేకుండా పౌరులందరికీ సమానంగా వర్తించే వ్యక్తిగత చట్టాలను రూపొందించే ప్రతిపాదన. కేంద్రం, రాష్ట్రాల్లోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అదే అమలు చేస్తామని హామీ ఇచ్చింది.

మీటింగ్‌లో ఇంకా ఏమి జరిగింది?

యూనిఫాం సివిల్ కోడ్‌కు వ్యతిరేకంగా తీర్మానం కాకుండా.. జమియత్ ఉలమా-ఎ-హింద్ (Jamiat Ulama-e-Hind) కొనసాగుతున్న మందిర్-మసీదు వివాదంపై తీర్మానాన్ని కూడా ఆమోదించింది. వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు వంటి ప్రార్థనా స్థలాలపై వివాదం చెలరేగడంపై సంస్థ అసంతృప్తి వ్యక్తం చేసింది. సదస్సులో జమియత్ ఉలామా-ఎ-హింద్ చీఫ్ మౌలానా మహమూద్ అసద్ మదానీ మాట్లాడుతూ.. మాకు [ముస్లింలు] పాకిస్థాన్‌కు వెళ్లే అవకాశం ఉంది, కానీ మేము వెళ్ళలేదని తెలిపారు. శనివారం.. ముస్లిం సంస్థ రెండు రోజుల కార్యక్రమంలో 'ఇస్లామోఫోబియా' సమస్యను ప్రస్తావించింది. సభనుద్దేశించి ఉద్వేగభరితమైన ప్రసంగంలో మహమూద్ అసద్ మదానీ మాట్లాడుతూ.. తమ దేశంలోనే ముస్లింలు అపరిచితులుగా తయారయ్యారని అన్నారు.