శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో పుల్వామా దాడి లాగా మరో దాడి చేసేందుకు నిషేధిత జైషే మొహమ్మద్ వ్యూహరచన చేసినట్లు నిఘా సంస్థలు హెచ్చరించాయి. వచ్చే మూడు, నాలుగు రోజుల్లో అటువంటి దాడి చేయడానికి ఉగ్రవాదులు ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. 

నిఘా సంస్థలకు అందిన సమాచారం మేరకు... పాకిస్తాన్ లోని బాలకోట్ లో భారత వైమానిక దాడులకు ప్రతీకారంగా త్వరలో కాశ్మీర్ లో మరో దాడి చేయాలని జైష్ ఎ మొహమ్మద్ ప్లాన్ చేసుకుంది. నిర్దిష్టమైన సమాచారం అందడంతో రాష్ట్రంలో భద్రతా సంస్థలు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యాయి.

మసూద్ అజర్ నాయకత్వంలో జైష్ ఎ మొమ్మద్ ఉగ్రవాదులు ఖాజీగుండ్, అనంతనాగ్ ల్లో ఐఈడి దాడులు చేయాలని ప్రణాళిక వేసుకున్నట్లు తెలుస్తోంది. తమ ప్రణాళికను అమలు చేయడానికి ఈసారి టాటా సుమో ఎస్ యూవీ వాడాలని కూడా అనుకున్నట్లు తెలుస్తోంది.

జమ్మూలోని ఓ బస్సులో పేలుడు సంఘటన తర్వాత నిఘా సంస్థలకు ఆ ప్లాన్ కు సంబంధించిన సమాచారం అందింది. బస్సులో సంభవించిన పేలుడులో ఓ వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే. పేలుడుకు పాల్పడిన వ్యక్తిని కూడా భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. 

విచారణలో జైష్ ఎ మొహమ్మద్ కు చెందిన ఆ వ్యక్తి తన నేరాన్ని అంగీకరించాడు. కుల్గామ్ హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ ఫరూఖ్ అహ్మద్ భట్ అలియాస్ ఒమర్ ఈ దాడికి ప్లాన్ వేసినట్లు అతను వెల్లడించాడు.