మధ్యప్రదేశ్‌లో ఓ విచిత్రం వెలుగులోకి వచ్చింది. మర్డర్ కేసులో పేరు వచ్చి జైలు పాలైన వ్యక్తిని ఆ ఊరి ప్రజలు జనపద పంచాయతీ అధ్యక్షుడిగా గెలిపించాయి. ఆ కేసులో ఆయన మూడేళ్లకుపైగా జైలులోనే ఉన్నట్టు తండ్రి ఆరోపించారు. 

భోపాల్: మర్డర్ కేసులో నిందితుడిగా ఉండి జైలులో ఉన్న ఓ వ్యక్తి ఆ ఊరి గ్రామ సర్పంచ్‌గా గెలిచాడు. బుధవారం ఆయనను జనపద్ గ్రామపంచాయతీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. 

ఇంద్రపాల్ పటేల్ అనే వ్యక్తి గత మూడేళ్లుగా జైలులో ఉన్నాడు. ఆయన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనపద్ పంచాయతీ మెంబర్‌గా గెలుపొందాడు. అనంతరం, ఆయన హట్టా జనపద్ పంచాయతీ అధ్యక్షుడిగా గెలుపొందాడు.

సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్, ఎన్నికల అధికారి అభిషేక్ ఠాకూర్.. పటేల్‌ను జనపద్ పంచాయతీ అధ్యక్షుడిగా గెలుపొందినట్టు ప్రకటించారు. హట్టా జనపద్ పంచాయతీలో 17 మంది సభ్యులు ఉంటారు. అందులో 16 ఓట్లకు గాను 11 ఓట్లు ఇంద్రపాల్ పటేల్‌కే పడ్డాయి. ఇంద్రపాల్ పటేల్ జైలులో ఉండటం మూలంగా తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయాడు.

ఈ ఎన్నికల ఎలాంటి పార్టీ సింబల్ లేకుండానే జరిగింది. ఈ విజయం తర్వాత ఇంద్రపాల్ పటేల్ తండ్రి, జిల్లా మాజీ పంచాయతీ ప్రెసిడెంట్ శివచరణ్ పటేల్ మాట్లాడారు. మర్డర్ కేసులో తన కొడుకు పేరు వచ్చినందుకు మూడేళ్లుగా పైగా జైలులోనే ఉంచుతున్నారని ఆరోపించారు. ఆ కేసే చట్టానికి లోబడి లేదని ఆరోపణలు చేశారు. 

మధ్యప్రదేశ్‌లో మొత్తం 313 జనపద్ పంచాయతీలకు గాను 170 జనపద్ పంచాయతీల్లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్‌లను బుధవారం ఎన్నుకున్నారు. మిగిలిన 143 జనపద్ పంచాయతీలకు ఓటింగ్‌ గురువారం జరుగుతుందని ఓ అధికారి తెలిపారు. ఓటింగ్ ముగియగనే వెంటనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.