భువనేశ్వర్ పెళ్లైన రెండు మాసాలకే వివాహిత అదృశ్యమైంది. ఏడేళ్ల తర్వాత ఆమె కన్పించింది. భార్యను చంపాడనే నెపంతో అతను జైలుకు కూడ వెళ్లి వచ్చాడు. ఏడేళ్ల తర్వాత ప్రియుడితో సహజీవనం చేస్తున్న ఆమెను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకొంది. 

ఒడిశా రాష్ట్రంలోని  కేంద్రపర జిల్లాకు చెందిన యువకుడికి అదే ప్రాంతానికి చెందిన యువతితో 2013లో పెళ్లైంది.  రెండు నెలల తర్వాత నవ వధువు అదృశ్యమైంది. ఆమె కోసం  భర్తతో పాటు ఆమె కుటుంబసభ్యులు కూడ అన్ని చోట్ల వెదికారు కానీ ఆమె ఆచూకీ లభ్యం కాలేదు.

వరకట్నం కోసం అత్తింటి వాళ్లే తన కూతురును హత్య చేసి పూడ్చి పెట్టారని నవ వధువు కుటుంబసభ్యులు భర్తతో పాటు అత్తామామలపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా  పోలీసులు కేసు నమోదు చేసి భర్తను అరెస్ట్ చేశారు. నెల రోజుల పాటు జైల్లో కూడ అతడిని ఉంచారు. తన భార్య అదృశ్యం కావడానికి తమ కుటుంబానికి ఎలంటి సంబంధం లేదని చెప్పినా కూడ  పోలీసులు విన్పించుకోలేదని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.

అయితే తన భార్య ఆచూకీ కోసం అతను ఏడేళ్లుగా వెతకడం ప్రారంభించాడు. పూరీ జిల్లాలోని పిప్పిలిలో రాజీవ్‌లోచన్ మహరాణా అనే వ్యక్తితో ఆమె సహజీవనం చేస్తోంది. ఈ విషయాన్ని అతను గుర్తించాడు. 

ఆ జంటను గుర్తించి వారిని పోలీసులకు అప్పగించాడు. పెళ్లికి ముందు రాజీవ్ , ఆ యువతి ప్రేమించుకొన్నారు. అయినా కూడ వేరే వ్యక్తితో పెళ్లి చేశారు.

ఈ పెళ్లి ఇష్టం లేని నవవధువు పెళ్లైన తర్వాత కూడ ప్రియుడితో సంబంధాలు కొనసాగించింది. ఈ క్రమంలోనే పెళ్లైన రెండు మాసాలకే ప్రియుడితో జంప్ అయింది.  ఈ విషయం తెలియక తమ కూతురును అత్తింటి వాళ్లే చంపారని పుట్టింటివాళ్లు కేసు పెట్టారు.చేయని నేరం అనుభవించాల్సి వస్తోందని  భావించిన ఆ యువకుడు ఏడేళ్ల కష్టపడి ఆ జంటను పట్టుకొన్నాడు.