బీహార్ జైల్లో శనివారం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ  సందర్భంగా ఖైషర్ అలీ అనే ఖైదీ ఫోన్‌ను మింగేశాడు.

పాట్నా: జైల్లో ఉన్న ఖైదీలకు బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధాలూ ఉండవు. సెల్ ఫోన్ లాంటి వస్తువుల వాడకం అనుమతి ఉండదు. కానీ కొన్నిసార్లు జైలు అధికారుల కళ్లుగప్పి ఖైదీలు ఫోన్లను వాడుతుంటారు. జైల్లో ఉంటూనే బయట తమ పనులు చక్కబెడుతుంటారు. అలా బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా జైలులో ఓ ఖైదీ దొంగతనంగా ఫోన్ వాడుతున్నాడు. అయితే జైలు అధికారులు జైలులో తనిఖీలు చేపట్టడంతో పట్టుబడతారేమోననే భయంతో మొబైల్ ఫోన్ మింగేసినట్లు సమాచారం.

శనివారం నాడు ఈ ఘటన జరిగింది. జైల్లో తనిఖీల సందర్భంగా ఖైషర్ అలీ అనే ఖైదీ ఫోన్‌ను మింగేశాడు. ఆ విషయం అప్పుడు ఎవ్వరూ గమనించలేదు. కానీ, ఆదివారం అలీకి కడుపులో విపరీతమైన నొప్పి రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

"కడుపునొప్పి తట్టుకోలేక ఖైదీ జైలు అధికారులకు తాను ఫోన్ మింగిన సమాచారం అందించాడు. సంఘటన ఎలా జరిగిందో ఆ క్రమాన్ని వివరించాడు. అది విన్న జైలు అధికారులు వెంటనే అతన్ని గోపాల్‌గంజ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఖైదీకి ఎక్స్-రే తీయగా అతని కడుపులో వేరే వస్తువేదో ఉన్నట్లు తేలింది" అని గోపాల్‌గంజ్ జైలు సూపరింటెండెంట్ మనోజ్ కుమార్ సోమవారం రోజు తెలిపారు. 

ఛత్తీస్‌గఢ్‌లో ‌ఈడీ దాడులు.. సీఎం బఘేల్ సన్నిహితులకు చెందిన 14 చోట్ల సోదాలు..!

ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోని వైద్యుడు సలాం సిద్ధిఖీ మాట్లాడుతూ.. కడుపునొప్పి కారణంగా ఖైదీని ఆసుపత్రిలో చేర్చామని, అతని కడుపు ఎక్స్‌రే తీయగా, పరీక్షలో ఏదో వస్తువు ఉన్నట్టుగా కనిపించిందని, దానిని క్షుణ్ణంగా విచారించాల్సిన అవసరం ఉందని చెప్పారు" ఆసుపత్రి ద్వారా మెడికల్ బోర్డు ఏర్పాటు చేయబడింది. ఖైదీని తదుపరి చికిత్స కోసం పాట్నా మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి రెఫర్ చేశారు.

నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ (ఎన్‌డిపిఎస్ యాక్ట్) నిబంధనల కింద జనవరి 17, 2020న అలీని గోపాల్‌గంజ్ పోలీసులు అరెస్టు చేశారు. అప్పటినుంచి గత మూడేళ్లుగా జైల్లోనే ఉన్నాడు. బీహార్ జైళ్లలో ఖైదీలు మొబైల్ ఫోన్ ఉపయోగించడం భద్రతా అధికారులమీద ఒత్తిడి పెంచింది. 

గతంలో 2021 మార్చిలో రాష్ట్రవ్యాప్తంగా జైళ్లలో నిర్వహించిన దాడుల్లో దాదాపు 35 సెల్‌ఫోన్‌లు, ఏడు సిమ్ కార్డ్‌లు, 17 సెల్‌ఫోన్ ఛార్జర్‌లను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలోని కతిహార్, బక్సర్, గోపాల్‌గంజ్, నలంద, హాజీపూర్, ఆరా, జెహనాబాద్, మరికొన్ని జైళ్లపై దాడులు నిర్వహించారు.