భారత నూతన ఉప రాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌కర్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 

భారత నూతన ఉప రాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌కర్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్.. తదితరులు పాల్గొన్నారు. ఇక, ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పదవీకాలం నిన్నటితో (ఆగస్టు 10) ముగిసిన సంగతి తెలిసిందే. 

ఇక, ఇటీవల జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేసిన జగదీప్ ధన్‌కర్‌ 74.36 శాతం భారీ ఓట్లతో గెలుపొందారు. గత ఆరు ఉప రాష్ట్రపతి ఎన్నికలలో అత్యధికం ఇదే కావడం గమనార్హం. ఈ ఎన్నికలో జగదీప్ ధన్‌కర్‌కు 528 ఓట్లు రాగా, విపక్షా అభ్యర్థి మార్గరెట్ అల్వాకు 182 ఓట్లు వచ్చాయి. ఎన్నికలు ముగిసిన ఒక రోజు తర్వాత.. జగదీప్ ధన్‌కర్ ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం సర్టిఫికెట్ జారీ చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనుప్ చంద్ర పాండే ధంకర్ యొక్క “ఎన్నికల ధ్రువీకరణ” పై సంతకం చేశారు.

జగదీప్ ధన్‌కర్ 1951 మే 18న రాజస్థాన్‌లోని జుంజును జిల్లాలోని ఒక గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. చిత్తోర్‌ఘర్‌లోని సైనిక్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. భౌతిక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత.. ఆయన రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుండి LLB చదివారు. మొదటి తరం ప్రొఫెషనల్ అయినప్పటికీ.. అతను రాష్ట్రంలోని ప్రముఖ న్యాయవాదులలో ఒకరిగి నిలిచారు. రాజస్థాన్ హైకోర్టు, భారత సుప్రీంకోర్టు రెండింటిలోనూ ధన్‌కర్ ప్రాక్టీస్ చేశారు. 1989 లోక్‌సభ ఎన్నికల్లో జనతాదళ్ టిక్కెట్‌పై ఝుంజును నుంచి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన తర్వాత ఆయన ప్రజా జీవితంలోకి ప్రవేశించారు. అతను 1990లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. 

ధన్‌కర్ రాజకీయాలు మొదట్లో మాజీ ఉప ప్రధాని దేవి లాల్ చేత ప్రభావితమయ్యాయి. జాట్ కమ్యూనిటీకి చెందిన జ‌గ‌దీప్ ధన్‌కర్ తర్వాత రాష్ట్ర రాజకీయాలపై పూర్తి దృష్టి సారించారు. 1993లో అజ్మీర్ జిల్లాలోని కిషన్‌గఢ్ నియోజకవర్గం నుంచి రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2019లో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ధంఖర్ నియమితులయ్యారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తన పేరును ప్రకటించిన తర్వాత జూలై 17న పశ్చిమ బెంగాల్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు.